RCB vs GT Final: అందుకే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నా.. ఐపీఎల్ 2026 టైటిల్ తమదే అంటున్న ఆర్సీబీ కెప్టెన్!
IPL 2026 Final RCB vs GT Playing 11. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గ్రాండ్‌గా తెరలేచింది.
RCB vs GT Final: అందుకే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నా.. ఐపీఎల్ 2026 టైటిల్ తమదే అంటున్న ఆర్సీబీ కెప్టెన్!
RCB vs GT Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గ్రాండ్‌గా తెరలేచింది. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ ఆరంభం కానుంది.
టాస్ అనంతరం మాట్లాడిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపాడు. ఈ పిచ్‌పై తొలి మూడు ఓవర్లలో పేసర్లకు కొంత సహకారం లభించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలలో ఒకటైన నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ ఆడటం ప్రత్యేక అనుభూతినిస్తోందని చెప్పాడు. జట్టులో ఒక మార్పు చేసినట్లు వెల్లడించిన గిల్.. సాయి కిషోర్ స్థానంలో అర్షద్ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు.
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, 40 ఓవర్ల పాటు పెద్దగా మార్పులు ఉండవని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థిని వీలైనంత త్వరగా కట్టడి చేయాలనే లక్ష్యంతో బౌలింగ్ ఎంచుకున్నామని తెలిపాడు. గత ఏడాది టైటిల్ విజయానికి సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నప్పటికీ.. ఇది కొత్త సీజన్ అని, ప్రస్తుత మ్యాచ్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టామని చెప్పాడు. అభిమానుల మద్దతు ఎప్పటిలాగే తమకు బలాన్నిస్తోందని, ఆర్సీబీ 12th Man Army ఎక్కడ మ్యాచ్ జరిగినా తమకు అండగా నిలుస్తోందని పేర్కొన్నాడు. ఫైనల్‌కు ఎలాంటి మార్పులు చేయలేదని పాటీదార్ వెల్లడించాడు. ఐపీఎల్ టైటిల్ తమదే అని ధీమా వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026 ట్రోఫీ కోసం జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ ఫైనల్లో రెండు జట్లూ బలంగా కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, కగిసో రబాడా వంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారో మరికొన్ని గంటల్లో తేలనుంది.
తుది జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ దార్. గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, నిశాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్.
ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్:
గుజరాత్ టైటాన్స్: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమార్ కుశాగ్ర, సాయి కిషోర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: వెంకటేశ్ అయ్యర్, కనిష్క్ చౌహాన్, స్వప్నిల్ సింగ్, అభినందన్ సింగ్, జోర్డాన్ కాక్స్.




