వన్డేల్లో డబుల్ సెంచరీ.. ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ ఆడనివ్వని ఫ్రాంచైజీ.. ఆ బ్యాడ్‌లక్కోడు ఎవరంటే?

Delhi Capitals Team Bench: వన్డేల్లో ద్విశతకం బాదిన ఒకప్పటి స్టార్ ఓపెనర్, ఈ సీజన్ అంతా సహచర ఆటగాళ్లకు నీళ్లు అందిస్తూ బెంచ్‌కే పరిమితమవ్వడం అభిమానులను కలచివేస్తోంది.

Venkat
Published on: 29 May 2026 10:47 AM IST
Delhi Capitals Team Bench
X

వన్డేల్లో డబుల్ సెంచరీ.. ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ ఆడనివ్వని ఫ్రాంచైజీ.. ఆ బ్యాడ్‌లక్కోడు ఎవరంటే?

Delhi Capitals Team Bench: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగిసింది. ఆరు జట్లు ఇంటిబాట పట్టగా, ప్లేఆఫ్స్ సమరం రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ మెగా టోర్నీలో కొందరు ఆటగాళ్ల అదృష్టం మైదానంలో మెరిస్తే, మరికొందరి పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారింది. వన్డేల్లో ద్విశతకం బాదిన ఒకప్పటి స్టార్ ఓపెనర్, ఈ సీజన్ అంతా సహచర ఆటగాళ్లకు నీళ్లు అందిస్తూ బెంచ్‌కే పరిమితమవ్వడం అభిమానులను కలచివేస్తోంది.

ఆశల పల్లకీ నుంచి అగాధంలోకి.. ఢిల్లీ మేనేజ్‌మెంట్ దారుణ నిర్లక్ష్యం!

భారత క్రికెట్ ప్రపంచంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఆ ఆటగాడు మరెవరో కాదు పృథ్వీ షా. టెస్టు అరంగేట్రంలోనే అద్భుత శతకంతో కదం తొక్కి, భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా వెలిగిన ఈ ముంబై బ్యాటర్‌ను ఐపీఎల్ 2026 సీజన్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 75 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. లీగ్ దశలో ఢిల్లీ జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడినా, కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా పృథ్వీ షాకు ఆడే అవకాశం దక్కలేదు. జట్టు విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా కెప్టెన్, యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచకపోవడం గమనార్హం. లీగ్ చివరి మ్యాచ్‌లో లక్నో జట్టు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినా, అతని స్నేహితుడైన పృథ్వీ షాకు మాత్రం ఆ అదృష్టం లేకపోయింది.

నాడు ‘నెక్స్ట్ సచిన్’.. నేడు మైదానం బయటే!

క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన కొత్తలో పృథ్వీ షా ఆటతీరు చూసి విశ్లేషకులు, అభిమానులు అతడిని ‘తదుపరి సచిన్ టెండూల్కర్’ అని ఆకాశానికెత్తారు. వెస్టిండీస్‌పై టెస్టుల్లో విధ్వంసకర శతకంతో అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత గాయాలు, పేలవమైన ఫామ్ అతడిని తీవ్రంగా వేధించాయి. క్రమంగా భారత జట్టులో స్థానం కోల్పోయిన పృథ్వీ షాను కాలక్రమేణా సెలెక్టర్లు కూడా పూర్తిగా విస్మరించారు.

వన్డేల్లో డబుల్ సెంచరీ.. ఒకే ఓవర్లో ఆరు ఫోర్ల రికార్డు!

పరిమిత ఓవర్ల క్రికెట్లో పృథ్వీ షా రికార్డులు సామాన్యమైనవి కావు. 2021 విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతూ పుదుచ్చేరి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 152 బంతుల్లో 31 ఫోర్లు, 5 సిక్సర్లతో 227 పరుగుల అజేయ ద్విశతకాన్ని నమోదు చేశాడు. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో వరుసగా 6 ఫోర్లు కొట్టిన ఇద్దరు బ్యాటర్లలో పృథ్వీ ఒకడు. 2021 సీజన్లో శివమ్ మావి ఓవర్లో అతను ఈ అద్భుత ఘనత సాధించాడు. ఆ సీజన్లో 159.13 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 479 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 79 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా 147.47 స్ట్రైక్ రేట్‌తో 1892 పరుగులు సాధించాడు.

ముగిసిపోయినట్లేనా? కెరీర్ ముందేం ఉంది?

2018లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పృథ్వీ షాకు 2024 వరకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ క్రమశిక్షణా రాహిత్యం, నిలకడలేని ఆటతీరు కారణంగా 2025 వేలంలో అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశం ఇచ్చినా, తుది జట్టులో చోటు కల్పించకపోవడం అతని కెరీర్‌ను మరింత ప్రమాదంలోకి నెట్టేసింది. 27 ఏళ్ల వయసులోనే ఒక అద్భుతమైన ప్రతిభ గల ఆటగాడి కెరీర్ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయే పరిస్థితి రావడం నిజంగా క్రీడాలోకానికి తీరని చేదైన నిజం.

ప్రతిభ ఉండి కూడా సరైన అవకాశాలు రాక, ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న పృథ్వీ షా భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే దేశవాళీ సీజన్లలో అసాధారణ ప్రదర్శన చేస్తే తప్ప, మళ్లీ ఐపీఎల్ వేదికపై ఈ ముంబై డాషర్ బ్యాట్ ఝుళిపించడం అంత తేలిక కాదు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story