IPL 2026 : కేఎల్ రాహుల్, నిసాంక విధ్వంసం.. రికార్డు రన్ చేజ్‌తో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

IPL 2026 : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రక విజయం అందుకుంది. 226 పరుగుల రికార్డు లక్ష్యాన్ని కేఎల్ రాహుల్ టీం ఛేదించింది. మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో మెరుపులు మెరిపించాడు.

CR Reddy
Published on: 2 May 2026 6:52 AM IST
DC vs RR
X

 DC vs RR

IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కొండంత లక్ష్యాన్ని కరిగించి, రాజస్థాన్ రాయల్స్ నోటికాడ విజయాన్ని లాగేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీకి ఇది అతిపెద్ద రన్ చేజ్ కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ తన రీఎంట్రీ మ్యాచ్‌లోనే యశస్వి జైస్వాల్‌ను అవుట్ చేసి ఢిల్లీకి శుభారంభం ఇచ్చాడు. అయితే, కెప్టెన్ రియాన్ పరాగ్ (90) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. సెంచరీ దిశగా సాగుతున్న పరాగ్‌ను స్టార్క్ తెలివిగా అవుట్ చేశాడు. చివర్లో డోనోవన్ ఫెరీరా కేవలం 14 బంతుల్లో 47 పరుగులు చేసి విధ్వంసం సృష్టించడంతో రాజస్థాన్ 225 పరుగుల భారీ స్కోరు సాధించింది.

226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పతుమ్ నిసాంక, కేఎల్ రాహుల్ ఊహించని ఆరంభాన్ని ఇచ్చారు. జట్టులోకి మళ్ళీ వచ్చిన నిసాంక కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రాజస్థాన్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. వీరు తొలి వికెట్‌కు కేవలం 9.3 ఓవర్లలోనే 110 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్ (75) కూడా క్లాస్ షాట్లతో అలరిస్తూ 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.

ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేస్తారని భావించినా, నితీష్ రాణా (33) తన వంతు సహకారాన్ని అందించాడు. చివరిలో ట్రిస్టన్ స్టబ్స్, ఆశుతోష్ శర్మలు అజేయమైన భాగస్వామ్యంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అతిపెద్ద విజయవంతమైన రన్ చేజ్ కావడం విశేషం. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లేఆఫ్స్ రేసులో తన ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ వంటి స్పిన్నర్లు కూడా ఢిల్లీ బ్యాటర్ల ధాటిని అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోవడం రాజస్థాన్ కొంపముంచింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్స్‌కు ఈ ఓటమి పెద్ద గుణపాఠం లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story