IPL 2026: షాకింగ్.. స్టార్ ప్లేయర్స్ కోచ్‌లపై బీసీసీఐ కఠిన చర్యలు!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ కేవలం ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లకే కాకుండా.. క్రమశిక్షణా చర్యల కారణంగా కూడా వార్తల్లో నిలిచింది.

Rishvik
Published on: 2 Jun 2026 7:21 PM IST
IPL 2026
X

IPL 2026: షాకింగ్.. స్టార్ ప్లేయర్స్ కోచ్‌లపై బీసీసీఐ కఠిన చర్యలు!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ తాజాగా ముగిసింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)ని ఓడించిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. రెండోసారి ఐపీఎల్ కప్ అందుకుంది. అయితే ఈ సీజన్ కేవలం ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లకే కాకుండా.. క్రమశిక్షణా చర్యల కారణంగా కూడా వార్తల్లో నిలిచింది. పలువురు స్టార్ ఆటగాళ్లు, కెప్టెన్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ సభ్యులు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనల కారణంగా భారీగా జరిమానాలు ఎదుర్కొన్నారు. ఐపీఎల్ పాలక వర్గం, బీసీసీఐ కలిసి కొందరికి భారీ మొత్తంలో ఫైన్లు విధించగా.. మరికొందరికి డీమెరిట్ పాయింట్లు కూడా నమోదు చేశాయి. ఐపీఎల్ 2026లో జరిమానాల వర్షం కురవగా.. ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్‌పై సస్పెన్షన్ కూడా పడింది.

కోచ్‌లు, కెప్టెన్లపై భారీ జరిమానాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానాను బీసీసీఐ విధించబడింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫోర్త్ అంపైర్‌తో దూకుడుగా వ్యవహరించడంతో ఈ చర్య తీసుకున్నారు. అదే సమయంలో పలువురు కెప్టెన్లు కూడా ఫైన్‌ల నుంచి తప్పించుకోలేకపోయారు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌లపై రూ.12 లక్షల చొప్పున జరిమానాలు విధించారు. శ్రేయస్ అయ్యర్‌పై రెండోసారి రూ.24 లక్షల జరిమానా కూడా పడింది. సారథులుగా స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడంతో మ్యాచ్ ఫీజులో కోతలు పడ్డాయి.

విరాట్ కోహ్లీ సహా పలువురికి మ్యాచ్ ఫీజులో కోత:

ఈ సీజన్‌లో కొంతమంది ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత పడింది. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మల మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించగా.. అంగ్‌క్రిష్ రఘువంశీపై 20 శాతం జరిమానా పడింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో వాగ్వాదానికి దిగి.. ఆన్-ఫీల్డ్ దూకుడు ప్రవర్తనకు పాల్పడినందుకు కోహ్లీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో అభిషేక్ బలయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వివాదాస్పదంగా ఔట్ అయిన తర్వాత ఆగ్రహంతో బౌండరీ కుషన్‌ను బ్యాట్‌తో కొట్టి, హెల్మెట్‌ను డగ్ అవుట్‌లోకి విసిరినందుకు రఘువంశీపై చర్యలు తీసుకున్నారు.

టిమ్ డేవిడ్‌పై సస్పెన్షన్:

రియాన్ పరాగ్, నితీష్ రాణాలకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక్కో డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు. నాండ్రే బర్గర్‌కు 10 శాతం ఫైన్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఇక ఐపీఎల్ 2026లో అత్యంత కఠిన శిక్షను ఎదుర్కొన్న ఆటగాడిగా టిమ్ డేవిడ్ నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‎తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌‌లో అంపైర్ నితిన్ మీనన్ వైపు ఆగ్రహంతో ఐస్ బ్యాగ్ విసిరినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు నమోదు చేశారు. మరో ఉల్లంఘన కారణంగా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు మరో డీమెరిట్ పాయింట్ విధించారు. డీమెరిట్ పాయింట్ల పరిమితిని అధిగమించడంతో టిమ్ డేవిడ్‌ను ఐపీఎల్ 2027 తొలి మ్యాచ్‌కు సస్పెండ్ చేశారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం సీజన్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారింది.

ఈసారి కఠిన వైఖరి:

న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్‌కు ఒక డీమెరిట్ పాయింట్ నమోదు చేయగా.. రవీందర్ సింగ్ భిందర్‌పై రూ.1 లక్ష జరిమానా విధించారు. మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన, అంపైర్ల నిర్ణయాలపై స్పందించే తీరు, కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల అమలులో ఐపీఎల్ యాజమాన్యం ఈసారి కఠిన వైఖరిని అవలంబించింది. స్టార్ ఆటగాళ్లు, కోచ్‌లు అయినా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఈ జరిమానాలు మరోసారి స్పష్టం చేశాయి. ఐపీఎల్ 2026లో నమోదైన ఈ క్రమశిక్షణా చర్యలు భవిష్యత్ సీజన్లలో ఆటగాళ్ల ప్రవర్తనపై మరింత ప్రభావం చూపే అవకాశముంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story