‘హిట్‌మ్యాన్’ లేని టీమిండియా ఎలా ఉండబోతోంది.. 2027 ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదేనా..?
India World Cup 2027 Squad: రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. అయితే, దక్షిణాఫ్రికా పిచ్‌లపై రోహిత్ ఇటీవలి రికార్డులు, వయసు రీత్యా సెలక్టర్లు భవిష్యత్తు జట్టుపై దృష్టి పెట్టారు.
‘హిట్‌మ్యాన్’ లేని టీమిండియా ఎలా ఉండబోతోంది.. 2027 ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదేనా..?
India World Cup 2027 Squad: భారత వన్డే క్రికెట్‌కు దిశానిర్దేశం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకనున్నారనే వార్తలు అభిమానులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఒకవేళ ఇంగ్లాండ్‌తో జరిగే పోరే రోహిత్‌కు చివరిదైతే, 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఉండబోతోంది? రోహిత్ శర్మ లేని 15 మందితో కూడిన పవర్ఫుల్ అంచనా జట్టు ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం..
సరికొత్త శకానికి నాంది.. గిల్ సారథ్యంలో యువ భారత్..
రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. అయితే, దక్షిణాఫ్రికా పిచ్‌లపై రోహిత్ ఇటీవలి రికార్డులు, వయసు రీత్యా సెలక్టర్లు భవిష్యత్తు జట్టుపై దృష్టి పెట్టారు. ఒకవేళ రోహిత్ శర్మ వీడ్కోలు పలికితే, 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. వన్డేల్లో 60కి పైగా అద్భుతమైన సగటు ఉన్న గిల్‌కు తోడుగా, ముంబై స్టార్ యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. రోహిత్ శర్మ వదిలివెళ్లిన స్థానాన్ని భర్తీ చేయడం సవాలే అయినప్పటికీ, జైస్వాల్ ప్రతిభపై మేనేజ్మెంట్ కొండంత నమ్మకంతో ఉంది.
కోహ్లీ ఒక్కడే సీనియర్.. పటిష్టమైన మిడిలార్డర్..
రోహిత్ శర్మ దూరం కానుండటంతో, బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ ఒక్కడే అత్యంత అనుభవజ్ఞుడైన సీనియర్ ఆటగాడిగా మిగలనున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే తిరుగులేని రారాజుగా నిలిచిన కోహ్లీకి దక్షిణాఫ్రికాలో దాదాపు 2,000 పరుగుల అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అక్కడి బౌన్సీ పిచ్‌లపై కోహ్లీ అనుభవం జట్టుకు ఎంతో కీలకం కానుంది.
ఇక మధ్య వరుసలో గత ప్రపంచకప్‌లో 500కు పైగా పరుగులు సాధించిన శ్రేయస్ అయ్యర్, నమ్మకమైన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విభాగానికి కొండంత అండగా నిలవనున్నారు. వీరితో పాటు 2026 టీ-20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
ఆల్‌రౌండర్ల హవా.. హార్దిక్‌కు తోడుగా తెలుగు కుర్రాడు..
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆల్‌రౌండర్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూర్తి ఫిట్నెస్తో ఉన్న హార్దిక్ పాండ్యా జట్టుకు ప్రధాన బలం కానున్నాడు. హార్దిక్‌కు తోడుగా తెలుగు రాష్ట్రాల ఆశాకిరణం నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉంది. నితీష్ బ్యాటింగ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుంది. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తమ విభిన్న శైలితో ప్రత్యర్థులను కట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
బుమ్రా నేతృత్వంలో నిప్పులు చెరిగే పేస్ దళం..
దక్షిణాఫ్రికా పిచ్‌లు పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి కాబట్టి, భారత బౌలింగ్ విభాగానికి జస్ప్రీత్ బుమ్రా సైన్యాధిపతిగా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికాలో 19 మ్యాచ్‌ల్లోనే 52 వికెట్లు తీసిన రికార్డు బుమ్రా సొంతం. అతడితో పాటు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగల పొడుగుపాటి బౌలర్ గుర్నూర్ బ్రార్, ఐపీఎల్ స్టార్ హర్షిత్ రాణా మూడో పేసర్‌గా జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఎడమచేతి వాటం పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టనున్నాడు. ఇక స్పిన్ విభాగంలో గత దశాబ్ద కాలంగా మాయాజాలం చేస్తున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా బాధ్యతలు మోయనున్నాడు.
రోహిత్ శర్మ లేని భారత జట్టును ఊహించుకోవడం అభిమానులకు కాస్త కష్టమే అయినప్పటికీ, కాలంతో పాటు మార్పులు సహజం. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో, విరాట్ కోహ్లీ అనుభవంతో కూడిన ఈ యువ భారత్ 2027 ప్రపంచకప్‌లో అడుగుపెడితే సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. అనుభవం, యవ్వనం కలబోసిన ఈ 15 మంది అంచనా జట్టు ప్రపంచకప్ సాధించగల సత్తా ఉన్న బలమైన కూర్పుగా కనిపిస్తోంది.




