భారత్ గెలిచినా, ట్రోఫీ తీసుకునే ఛాన్స్ లేదుగా.. మరోసారి తెరపైకి ఆ వివాదం..?

India Women Asia Cup Trophy: ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదని హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు నిర్ణయించినట్లు నివేదిక పేర్కొంది.

Venkat
Published on: 7 Sept 2026 12:25 PM IST
India Women Asia Cup Trophy
X

భారత్ గెలిచినా, ట్రోఫీ తీసుకునే ఛాన్స్ లేదుగా.. మరోసారి తెరపైకి ఆ వివాదం..?

India Women Asia Cup Trophy: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ఆసియా కప్ (Women’s Asia Cup 2026)లో భారత మహిళల జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్‌కు భారత్ అర్హత సాధించి విజేతగా నిలిస్తే.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదని జట్టు నిర్ణయించినట్లు నివేదిక వెల్లడించింది. నక్వీనే ఫైనల్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.

గత ఏడాది సీన్ రిపీట్..

2025 ఆసియా కప్ సందర్భంగా భారత్ పురుషుల జట్టు ట్రోఫీ స్వీకరణలో ఇదే తరహా వివాదం తలెత్తింది. పాకిస్థాన్‌తో ఫైనల్లో గెలిచిన అనంతరం భారత బృందం నక్వీ నుంచి ట్రోఫీ తీసుకోలేదు. దాదాపు అరగంట పాటు పోడియంపై వేచి ఉన్న నక్వీ.. చివరకు ట్రోఫీని తన వెంట తీసుకెళ్లి దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంచారు.

భారత్–పాక్ మ్యాచ్‌లోనూ దూరం..

మహిళల ఆసియా కప్ గ్రూప్ దశలో భారత్, పాకిస్థాన్ తలపడిన మ్యాచ్‌లోనూ ప్రోటోకాల్‌కు సంబంధించిన చర్చ జరిగింది. టాస్ సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా పరస్పరం హ్యాండ్‌షేక్ చేసుకోలేదు. ఇలాంటి పరిణామం ఇంతకుముందు మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ చోటు చేసుకున్నసంగతి తెలిసిందే.

ఫైనల్‌లో మళ్లీ భారత్–పాక్..?

భారత్ గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మరోవైపు పాకిస్థాన్ ఖాతాలో ప్రస్తుతం ఒక విజయం, ఒక ఓటమి ఉన్నాయి. హాంకాంగ్‌తో ఆ జట్టు చివరి గ్రూప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్లో శ్రీలంకను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇరు జట్లు సెమీస్‌లో గెలిస్తే ఆదివారం ఫైనల్‌లో మరోసారి భారత్–పాకిస్థాన్ పోరు జరగనుంది.

ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధిస్తే ట్రోఫీని ఎవరి చేతుల మీదుగా స్వీకరిస్తుందన్నది ఇప్పుడు ఆసియా కప్‌లో మరో ఆసక్తికర అంశంగా మారింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story