IND vs SL: టీమిండియాతో వార్మప్ మ్యాచ్.. శ్రీలంక 11 టీమ్ ప్రకటన.. మనోళ్లకు చుక్కలే ఇగ!
SLC XI squad announced, Sonal Dinusha captain. టీమిండియాతో ఆడే మూడు రోజుల వార్మప్ మ్యాచ్ కోసం బోర్డు శ్రీలంక ఎలెవన్ జట్టును ప్రకటించింది.
IND vs SL: టీమిండియాతో వార్మప్ మ్యాచ్.. శ్రీలంక 11 టీమ్ ప్రకటన.. మనోళ్లకు చుక్కలే ఇగ!
IND vs SL: ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించడం, లంకలో ల్యాండ్ అవ్వడం కూడా జరిగింది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) మాత్రం ఇంకా జట్టును ప్రకటించలేదు. అయితే సిరీస్‌కు ముందు టీమిండియాతో ఆడే మూడు రోజుల వార్మప్ మ్యాచ్ కోసం బోర్డు శ్రీలంక ఎలెవన్ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు యువ బౌలింగ్ ఆల్‌రౌండర్ సోనాల్ దినుషాను కెప్టెన్‌గా నియమించింది. శుక్రవారం నుంచి కొలంబోలోని ఎన్‌సీసీ మైదానంలో ఈ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టుకు శ్రీలంక పర్యటనలో ఏకైక వార్మప్ మ్యాచ్ ఇదే. టెస్టు సిరీస్‌కు ముందు ఇరు జట్లకు ఇది కీలకమైన సన్నాహక పోరుగా భావిస్తున్నారు. శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టులోని పలువురు ప్లేయర్స్ ప్రధాన టెస్టు జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నారు. కెప్టెన్ సోనాల్ దినుషాతో పాటు లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, రమేశ్ మెండిస్, నిశాన్ మధుష్క, పవన్ రత్నాయకే, అంజలా బండారాలు సత్తా చాటాలని చూస్తున్నారు. అలాగే భారత్-ఏ జట్టుపై గతంలో ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి ఆకట్టుకున్న ఎడమచేతి స్పిన్నర్ దిలుం సుదీర, ఐదు వికెట్లు పడగొట్టిన కేసర నువంతకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దాంతో లంక పటిష్టంగా ఉంది. ఇటీవల స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు పడుతున్న టీమిండియా బ్యాటర్లకు వీరు చుక్కలు చూపించే అవకాశాలు ఉన్నాయి.
సోనాల్ దినుషా గత ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన అతడికి కెప్టెన్సీ కూడా దక్కింది. ప్రస్తుతం పలువురు సీనియర్ శ్రీలంక ఆటగాళ్లు లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో బిజీగా ఉండటంతో.. ఈ వార్మప్ మ్యాచ్ యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునే మంచి అవకాశంగా మారింది. ఈ మ్యాచ్ అనంతరం టెస్టు సిరీస్‌కు తుది జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించే అవకాశం ఉంది. భారత్‌కు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆడే ముందు మ్యాచ్ ప్రాక్టీస్‌కు ఇది మంచి అవకాశం కానుంది. ఐపీఎల్ 2026 తర్వాత రవీంద్ర జడేజా తొలి మ్యాచ్ ఆడనున్నాడు. కొత్తగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ కూడా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశముంది.
అయితే యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. పాదం గాయం కారణంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతడు పునరావాసం పొందుతున్నాడు. అతడు ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంది. టెస్ట్ మ్యాచుకు ఇంకా వారం రోజుల సమయం ఉంది కాబట్టి అతడు జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అతడు అందుబాటులో లేకపోతే.. మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు అవకాశం లభించే అవకాశం కనిపిస్తోంది.
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టు:
నిశాన్ మధుష్క, రవీందు రశాంత, పసిందు సూరియబండారా, పవన్ రత్నాయకే, అహన్ విక్రమసింఘే, సోనాల్ దినుషా (కెప్టెన్), అంజలా బండారా (వికెట్ కీపర్), నిపున్ దనంజయ, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, అసంక మనోజ్, ఇసిత విజేసుందర, రమేశ్ మెండిస్, కేసర నువంత, దిలుం సుదీర.




