IND vs SL: లంక గడ్డపై బుడ్డోడు ఊరమాస్ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..?

India a vs Sri Lanka a Playing XI: ఐపీఎల్ 2026 సీజన్‌లో అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వేదికపై అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది.

Venkat
Published on: 8 Jun 2026 5:41 PM IST
IND vs SL
X

IND vs SL: లంక గడ్డపై బుడ్డోడు ఊరమాస్ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..?

India a vs Sri Lanka a Playing XI: ఆసియా ఖండంలోని మూడు అగ్రశ్రేణి జట్ల మధ్య జరగనున్న చారిత్రాత్మక ముక్కోణపు సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మంగళవారం (జూన్ 9) దంబుల్లాలోని రంగిరి అంతర్జాతీయ మైదానంలో ఆతిథ్య శ్రీలంకతో జరిగే తొలి పోరులో భారత్ ‘ఎ’ తలపడనుంది. తిలక్ వర్మ సారథ్యంలోని భారత జట్టు పటిష్టమైన ఆటగాళ్లతో ఈ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

లంకను ఢీకొట్టేందుకు యువ భారతం సై..

శ్రీలంక పిచ్‌లపై ఆతిథ్య జట్టును ఎదుర్కోవడం అంత సులువు కాదు. అయితే భారత్ ఈసారి సరికొత్త కుర్రాళ్లతో కూడిన బలమైన సైన్యాన్ని సిద్ధం చేసింది. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వేదికపై అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. కెప్టెన్ తిలక్ వర్మతో పాటు రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలవనున్నారు. సూర్యాంశ్ శెడ్గే, విప్రాజ్ నిగమ్, నిశాంత్ సింధు రూపంలో జట్టుకు అద్భుతమైన ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. ఐపీఎల్‌లో అదరగొట్టిన అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నారు.

పటిష్టమైన టాప్ ఆర్డర్.. రుతురాజ్ కసి తీరేనా?

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా రావడం ఖాయం. అయితే టీ20 తరహా ఆటతీరు కాకుండా సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. మరో ఓపెనర్ స్థానం కోసం ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య మధ్య పోటీ ఉన్నప్పటికీ, వికెట్ కీపింగ్ అనుభవం ఉన్న ప్రభ్‌సిమ్రన్‌కే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపనుంది. మరోవైపు, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ గాయపడినప్పటికీ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఈ సిరీస్‌ ద్వారా సెలెక్టర్లకు గట్టి సమాధానం చెప్పాలని కసితో ఉన్నాడు.

బలంగా మిడిల్ ఆర్డర్, ఆల్‌రౌండర్లు..

భారత బ్యాటింగ్ నౌకను నడిపించే బాధ్యత కెప్టెన్ తిలక్ వర్మపై ఉంది. ఐపీఎల్‌లో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, 2027 ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా తిలక్ ఇక్కడ పరుగుల వరద పారించాలని చూస్తున్నాడు. కష్ట సమయాల్లో ఇన్నింగ్స్‌ను నిలబెట్టగల ఆయుష్ బదోని ఐదో స్థానంలో రానున్నాడు. మ్యాచ్‌ను ముగించే ఫినిషర్‌గా సూర్యాంశ్ శెడ్గే బాధ్యతలు మోయనున్నాడు. ఇతడు జట్టుకు అదనపు పేస్ బౌలింగ్ ఆప్షన్‌గానూ పనికొస్తాడు. ఇక లోయర్ మిడిల్ ఆర్డర్‌లో స్పిన్ ఆల్‌రౌండర్లుగా విప్రాజ్ నిగమ్, అనుకుల్ రాయ్ ప్రత్యర్థిని కట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

పదునైన బౌలింగ్ విభాగం..

ఐపీఎల్‌లో కాస్త పరుగులు ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో వికెట్లు తీసే నైపుణ్యం ఉన్న అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించనున్నాడు. భవిష్యత్తు పేస్ గుర్రంగా భావిస్తున్న యశ్ ఠాకూర్‌తో కలిసి అతడు కొత్త బంతినూ పంచుకోనున్నాడు. ఇక గుజరాత్ తరపున ఆడిన అర్షద్ ఖాన్ మూడో పేసర్‌గా జట్టులోకి రానున్నాడు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడంలో ఇతడు కీలక పాత్ర పోషించనున్నాడు.

దంబుల్లా పిచ్ వాతావరణం, అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే భారత్ ‘ఎ’ జట్టు సమతూకంతో ఎంతో బలంగా కనిపిస్తోంది. యువ రక్తం, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు లంక గడ్డపై ముక్కోణపు సిరీస్‌ను విజయంతో ప్రారంభిస్తుందని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు.

భారత్ ఏ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ లేదా ప్రియాంశ్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ఆయుష్ బదోని, సూర్యాంశ్ శెడ్గే, విప్రాజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్‌, అర్షద్ ఖాన్.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story