IND-W vs PAK-W: 8 బంతుల్లో 3 వికెట్లు.. పాక్ టీం పాలిట యముడిలా తెలుగమ్మాయి..!

IND-W vs PAK-W: మహిళల ఆసియా కప్ 2026 గ్రూప్-A మ్యాచ్‌లో భాగంగా దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న పోరులో భారత బౌలర్లు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు.

Venkat
Published on: 5 Sept 2026 8:51 PM IST
IND-W vs PAK-W
X

IND-W vs PAK-W: 8 బంతుల్లో 3 వికెట్లు.. పాక్ టీం పాలిట యముడిలా తెలుగమ్మాయి..!

India Women vs Pakistan Women: మహిళల ఆసియా కప్ 2026 గ్రూప్-A మ్యాచ్‌లో భాగంగా దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న పోరులో భారత బౌలర్లు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 8 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ శ్రీ చరణి అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో కేవలం 8 బంతుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.

తడబడిన పాకిస్థాన్ టాప్ ఆర్డర్..

పాకిస్థాన్ ఓపెనర్లు మునీబా అలీ 13 పరుగులు (15 బంతులు), షావాల్ జుల్ఫీకర్ 14 పరుగులు (14 బంతులు) చేసి స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. షఫాలీ వర్మ బౌలింగ్‌లో మునీబా ఔట్ కాగా, ఆ తర్వాత శ్రీ చరణి దాడి ప్రారంభించింది. జుల్ఫీకర్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన చరణి, గుల్ ఫిరోజాను ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టించింది. అనంతరం 8వ ఓవర్‌లో అయేషా జాఫర్ (2) ఇచ్చిన క్యాచ్‌ను భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా ఒడిసిపట్టుకోవడంతో చరణి తన ఖాతాలో మూడో వికెట్ నమోదు చేసుకుంది.

కట్టుదిట్టంగా భారత బౌలింగ్..

భారత బౌలర్లలో శ్రీ చరణి 2 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీసింది. షఫాలీ వర్మ ఒక ఓవర్‌లో 4 పరుగులిచ్చి ఒక వికెట్ తీసింది. క్రాంతి గౌడ్ (2 ఓవర్లలో 9 పరుగులు), నందని శర్మ (2 ఓవర్లలో 14 పరుగులు), దీప్తి శర్మ (1 ఓవర్‌లో 2 పరుగులు) పరుగులు రాకుండా కట్టడి చేశారు. క్రీజులో సదాఫ్ షామ్స్ (2*), కెప్టెన్ ఫాతిమా సనా (0*) కొనసాగుతున్నారు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story