IND vs SL: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. కొత్త ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు దబిడిదిబిడే!

IND vs SL: భారత్‌తో తొలి టెస్టు కోసం శ్రీలంక 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

Rishvik
Published on: 12 Aug 2026 6:03 PM IST
IND vs SL
X

IND vs SL: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. కొత్త ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు దబిడిదిబిడే!

IND vs SL: శ్రీలంక, భారత్ మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుంది. గాలె వేదికగా ఆగస్టు 15న తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టు కోసం శ్రీలంక క్రికెట్‌ బోర్డు బుధవారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. సీనియర్ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నిరోషన్ డిక్వెల్లా టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. అలాగే పేసర్ దిల్షాన్ మధుశంకకు కూడా చోటు దక్కింది. ధనంజయ డి సిల్వా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. కమిందు మెండిస్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

తొలి టెస్టుకు శ్రీలంక స్టార్ వికెట్‌ కీపర్‌ కుశాల్ మెండిస్ అందుబాటులో లేకపోవడంతో.. డిక్వెల్లాకు జట్టులో లంక సెలెక్టర్లు చోటు కల్పించారు. గాయం కారణంగా కుశాల్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో వికెట్‌ కీపింగ్ బాధ్యతలను డిక్వెల్లా చేపట్టనున్నాడు. మరోవైపు బ్యాటర్ పతుమ్ నిస్సంక కూడా తొలి టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేదు. శ్రీలంక బ్యాటింగ్ విభాగంలో లహిరు ఉదారా, నిషాన్ మధుష్క, దినేశ్ చందిమాల్, పసిందు సూరియబండారా, సోనల్ దినుషా ఉన్నారు. వీరితో పాటు కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా వంటి కీలక ఆటగాళ్లపై జట్టు ఆధారపడనుంది.

బౌలింగ్ విభాగంలో శ్రీలంక స్పిన్నర్లకు ప్రాధాన్యం ఇచ్చింది. రమేశ్ మెండిస్, ప్రభాత్ జయసూర్య, కేశర నువంత స్పిన్ విభాగంలో ఉన్నారు. పేస్ బౌలింగ్‌ విభాగంలో మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండోతో పాటు దిల్షాన్ మధుశంకకు చోటు కల్పించారు. దీంతో భారత్‌ను సొంతగడ్డపై ఇబ్బంది పెట్టేందుకు శ్రీలంక బలమైన బౌలింగ్ దాడితో బరిలోకి దిగనుంది. జట్టులో అనుభజ్ఞులతో పాటు టీమిండియాతో వార్మప్‌ మ్యాచ్‌లో ఆకట్టుకున్న పలువురు ఆటగాళ్లకు చోటు దక్కింది. లంక పటిష్టంగా ఉండడంతో టీమిండియాకు విజయం అంత ఈజీ కాదు.

భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు టెస్టుల సిరీస్‌ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా జరుగుతోంది. దీంతో ఇరు జట్లకు ఈ సిరీస్‌ అత్యంత కీలకంగా మారింది. టీమిండియా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి.. నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో 48.150 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది. శ్రీలంక ఆరో స్థానంలో ఉంది. లంక ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి.. ఒక విజయం, ఒక డ్రా, రెండు ఓటములు నమోదు చేసింది. తొలి టెస్టులో భారత్‌ను ఓడించి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని శ్రీలంక భావిస్తోంది. మరోవైపు టీమిండియా కూడా సిరీస్‌ను విజయంతో ప్రారంభించి డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో తమ అవకాశాలను బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.

తొలి టెస్టుకు శ్రీలంక జట్టు:

ధనంజయ డి సిల్వా, లాహిరు ఉదానా, నిషాన్ మదుష్క, కమిందు మెండిస్, దినేశ్‌ చండిమాల్, పసిందు సూర్యబండార, సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా, రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేసర నువాంత, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షన్ మధుశంక.

భారత్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రర్, దేవదత్ పడిక్కల్, సరన్ష్ జైన్, అకిబ్ నబీ.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story