IND vs SL: ఆట నిలిపివేయరా అంటూ అంపైర్లపై ఫైర్.. కోపంతో గ్లౌజులు విసిరేసిన లంక ప్లేయర్!

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట చివర్లో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది.

Rishvik
Published on: 24 Aug 2026 8:13 PM IST
IND vs SL
X

IND vs SL: ఆట నిలిపివేయరా అంటూ అంపైర్లపై ఫైర్.. కోపంతో గ్లౌజులు విసిరేసిన లంక ప్లేయర్!

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట చివర్లో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. వెలుతురు క్రమంగా తగ్గిపోతున్నప్పటికీ.. ఆటను కొనసాగించాలన్న అంపైర్ల నిర్ణయంపై శ్రీలంక బ్యాటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వికెట్ కోల్పోయిన అనంతరం శ్రీలంక బ్యాటర్ ప్రభాత్ జయసూర్య ఆగ్రహానికి గురయ్యాడు. పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత తన గ్లౌజులను విసిరేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసిన అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు ఆటకు కొద్ది ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా.. కొలంబోలో వెలుతురు మందగించింది. ఈ పరిస్థితుల్లో అంపైర్లు లైట్ మీటర్‌తో వెలుతురును పరిశీలించారు. అయితే ఆటను నిలిపివేయకుండా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై శ్రీలంక బ్యాటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆట కొనసాగింది. భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మొదట లహిరు ఉదారాను అవుట్ చేశాడు. ఉదారా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం మానవ్ సుతార్ బౌలింగ్‌లో ప్రభాత్ జయసూర్య ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే జయసూర్య వికెట్‌కు ముందు వెలుతురు పరిస్థితులపై శ్రీలంక బ్యాటర్లు అంపైర్లతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు.

వికెట్ కోల్పోయి మైదానం వీడుతున్న సమయంలో ప్రభాత్ జయసూర్య పలుమార్లు అంపైర్ల వైపు కోపంగా చూస్తూ వెళ్లాడు. పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత తన గ్లౌజులను విసిరేశాడు. ఈ దృశ్యం మ్యాచ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కామెంట్రీ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ కూడా జయసూర్య తీవ్ర అసహనంలో ఉన్నాడని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ రెండో రోజు ఆటలో భారీ స్కోరు సాధించింది. తొలి రోజు 300/5తో ఆట ముగించిన టీమిండియా.. రెండో రోజు బ్యాటింగ్‌ను కొనసాగించి 503/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 177 బంతులు ఎదుర్కొన్న జురెల్ 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 115 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఇది అతడికి రెండో శతకం.

మరోవైపు తొలి రోజు గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన రిషభ్ పంత్ రెండో రోజు తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతమైన పోరాట పటిమను చూపించాడు. పంత్ 63 పరుగులు చేశాడు. జురెల్, పంత్ కలిసి ఏడో వికెట్‌కు 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం పంత్, మానవ్ సుతార్ వికెట్లను భారత్ కోల్పోయింది. భారత్ 503/9 వద్ద డిక్లేర్ చేసిన తర్వాత శ్రీలంకకు బ్యాటింగ్‌లో షాక్ తగిలింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8/2తో నిలిచింది. లహిరు ఉదారా 1, ప్రభాత్ జయసూర్య 2 పరుగులు చేసి ఔటయ్యారు. కమీల్ మిశారా 5 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. రెండో రోజు ముగిసే సమయానికి శ్రీలంక ఇంకా భారత్ కంటే 495 పరుగులు వెనుకబడి ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story