IND vs SL: శ్రీలంకతో తొలి టెస్టు.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై గిల్ క్లారిటీ.. రెండో పేసర్‌గా అతడికే ఛాన్స్!

IND playing XI vs SL 1st Test. గాలే వేదికగా శ్రీలంకతో జరిగే మొదటి టెస్టులో బరిలోకి దిగే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్లారిటీ ఇచ్చాడు.

Rishvik
Published on: 14 Aug 2026 5:19 PM IST
IND vs SL
X

IND vs SL: శ్రీలంకతో తొలి టెస్టు.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై గిల్ క్లారిటీ.. రెండో పేసర్‌గా అతడికే ఛాన్స్!

IND vs SL: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ శనివారం (ఆగష్టు 15) నుంచి ప్రారంభం కానుంది. గాలె వేదికగా జరిగే ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ ఎలా ఉంటుందో అని అందరిలో ఆసక్తి పెరిగింది. తాజాగా టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తుది జట్టుపై కీలక సంకేతాలు ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్‌కు జోడీగా ప్రసిద్ధ్ కృష్ణ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గిల్ చెప్పకనే చెప్పాడు. గిల్ వ్యాఖ్యలు చూస్తే యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు తుది జట్టులో చోటు కష్టమే.

గాలె టెస్టులో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ రూపంలో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్లు ఉండగా.. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ స్థానం దాదాపు ఖాయం. ఆయనకు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ లేదా గుర్నూర్ బ్రార్‌లో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది.

ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలనేది కఠినమైన నిర్ణయమని గిల్ పేర్కొన్నాడు. గుర్నూర్ 6 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో మంచి బౌన్స్ రాబట్టగలడని, పాత బంతితోనూ ప్రభావం చూపగలడని గిల్ చెప్పాడు. అయితే ప్రసిద్ధ్ ఇటీవల అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, వార్మప్ మ్యాచ్‌లోనూ తన సత్తా చాటాడని తెలిపాడు. దీంతో తుది నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్లేయింగ్ 11 ప్రకటిస్తాం అని గిల్ వెల్లడించాడు.

ప్రసిద్ధ్ కృష్ణకు టెస్టు అనుభవం ఉండటం అదనపు ప్రయోజనంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఏడు టెస్టులు ఆడిన ప్రసిద్ధ్.. 25 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు గుర్నూర్ బ్రార్‌ ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు. దీంతో శ్రీలంక పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన ప్రసిద్ధ్‌కు అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో.. అతడి స్థానాన్ని భర్తీ చేసే పేసర్‌కు ఇది తనను తాను నిరూపించుకునే గొప్ప అవకాశమని గిల్ పేర్కొన్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో ఎడమచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత కొన్ని టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ధ్రువ్ జురెల్‌కు మిడిలార్డర్‌లో మరో అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. యువ ఆటగాళ్లకు తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని గిల్ స్పష్టం చేశాడు. ఆటగాళ్లు తమంతట తాముగా ఎదగడానికి కొంత సమయం పడుతుందని, అందుకే వారిపై వెంటనే ఒత్తిడి పెంచకూడదని చెప్పాడు.

సాయి సుదర్శన్ ఫిట్‌నెస్, టీమ్ మేనేజ్‌మెంట్‌ మధ్య కమ్యూనికేషన్‌పై వస్తున్న ఊహాగానాలను కూడా గిల్ కొట్టిపారేశాడు. 'బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో టీమ్ మేనేజ్‌మెంట్‌తో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సాయి ఆశించిన స్థాయిలో కోలుకోలేదు. టెస్టు క్రికెట్‌లో రిస్క్ తీసుకోలేమము.

అయితే మా15 మంది ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంది. టెస్టు కెప్టెన్‌గా ఏడాది పూర్తి చేసుకున్నా. నా బాధ్యతల్లో ఇప్పుడు మరింత సౌకర్యంగా ఉన్నా. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో కొనసాగాలంటే భారత్ ఆరు లేదా ఏడు టెస్టుల్లో విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది. శ్రీలంకతో జరిగే ఈ సిరీస్‌ను విజయంతో ప్రారంభించి డబ్ల్యూటీసీ రేసులో నిలవాలి' అని గిల్ చెప్పాడు.

గాలె టెస్టు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది. ఇది టీమిండియా ఆడబోయే 600వ టెస్టు మ్యాచ్. 1932లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన భారత్.. ఇప్పుడు 600 టెస్టుల మైలురాయిని చేరుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశానికి 600వ టెస్టులో నాయకత్వం వహించడం తనకు ఎంతో గౌరవంగా ఉందని శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. గాలె పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మహ్మద్ సిరాజ్‌కు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ ఆడే అవకాశాలు గిల్ వ్యాఖ్యలతో మరింత బలపడ్డాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story