IND vs SL 1st Test: మానవ్ సుతార్ సంచలనం.. ఏకంగా 10 వికెట్లు.. శ్రీలంకపై భారత్ ఘన విజయం!

IND vs SL 1st Test: గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Rishvik
Published on: 19 Aug 2026 5:13 PM IST
IND vs SL 1st Test
X

IND vs SL 1st Test: మానవ్ సుతార్ సంచలనం.. ఏకంగా 10 వికెట్లు.. శ్రీలంకపై భారత్ ఘన విజయం!

IND vs SL 1st Test: గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదో రోజు ఆటలో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ శ్రీలంక బ్యాటింగ్‌ నడ్డివిరిచాడు. మానవ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టడంతో.. శ్రీలంక 206 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెరీర్‌లో రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న మానవ్.. ఈ మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 6/55తో అదరగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 10/101 గణాంకాలు నమోదు చేశాడు. వరుసగా రెండో టెస్టులోనూ ఐదు వికెట్ల ఘనత సాధించడం విశేషం.

ఐదో రోజు లంచ్ తర్వాత శ్రీలంక బ్యాటర్లు సోనల్ దినూష, కేశర నువాంత కలిసి భారత్ బౌలర్లను ప్రతిఘటించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన దినూష.. రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం దిశగా సాగాడు. ఒక దశలో దినూష 84 పరుగులతో క్రీజులో ఉండటంతో శ్రీలంక డ్రా కోసం పోరాడే అవకాశం కనిపించింది. అయితే 76వ ఓవర్‌లో మానవ్ సుతార్ అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. ఆ ఓవర్‌లో మానవ్ ట్రిపుల్ వికెట్ మెయిడెన్ సాధించాడు. అదనపు బౌన్స్ ఉపయోగిస్తూ దినూష్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే ప్రభాత్ జయసూర్యను క్లీన్ బౌల్డ్ చేసి.. గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు పంపించాడు.

మానవ్ సుతార్‌కు హ్యాట్రిక్ అవకాశం వచ్చినప్పటికీ.. లహిరు కుమార ఆ బంతిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. అయితే ఆ తర్వాత మానవ్ మరోసారి రౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేసి కుమారను బుట్టలో వేశాడు. రిషభ్ పంత్ సూపర్ క్యాచ్ అందుకోవడంతో మానవ్ మరోసారి ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక టేయిలెండర్లను భారత బౌలర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవనివ్వలేదు. కేశర నువాంత మాత్రం తన పోరాటం కొనసాగిస్తూ.. మానవ్ బౌలింగ్‌లో బౌండరీ బాది జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. కానీ 78వ ఓవర్‌లో మానవ్ వేసిన ఆర్మ్ బాల్‌కు నువాంత బౌల్డ్ కావడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఈ విజయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన భారీ ఆధిక్యం కీలకంగా మారింది. దేవదత్ పడిక్కల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 167 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ 66 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మానవ్ సుతార్ చెలరేగడంతో శ్రీలంక 206 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. గాలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ భారత టెస్టు చరిత్రలో 600వ టెస్టు కావడం మరో ప్రత్యేకత. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు కీలకమైన 12 పాయింట్లు కూడా లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులు చేసింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story