IND vs SL 1st Test: స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రక మైలురాయి.. ఎలైట్ లిస్టులో మూడో స్థానంలో భారత్!
India 600 Test Milestone: భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు భారత క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.
IND vs SL 1st Test: స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రక మైలురాయి.. ఎలైట్ లిస్టులో మూడో స్థానంలో భారత్!
IND vs SL 1st Test: భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు గాలెలోని గాలె ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈరోజు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. శ్రీలంకతో జరుగుతున్న ఈ టెస్టు టీమిండియాకు 600వ టెస్టు మ్యాచ్. 1932లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన భారత్.. దాదాపు తొమ్మిది దశాబ్దాల ప్రయాణంలో ఈ అరుదైన మైలురాయిని అందుకుంది.
80వ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే భారత జట్టు 600వ టెస్టు ఆడటం ఈ మ్యాచ్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశానికి 600వ టెస్టులో నాయకత్వం వహించే అరుదైన అవకాశం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు దక్కింది. ఈ అరుదైన సందర్భం తనకు ఎంతో గౌరవంగా ఉందని గిల్ పేర్కొన్నాడు.
పురుషుల టెస్టు క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఎలైట్ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ 1,097 టెస్టులతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 883 టెస్టులతో రెండో స్థానంలో ఉంది. తాజాగా భారత్ 600 టెస్టుల మైలురాయిని చేరుకుని.. తన మూడో స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. వెస్టిండీస్ 596 టెస్టులతో నాలుగో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 487 టెస్టులు ఆడి టాప్-5లో కొనసాగుతోంది. టీమిండియా మాజీలు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 100వ టెస్టుకు, కింగ్ విరాట్ కోహ్లీ 500వ టెస్టుకు నాయకత్వం వహించారు. 600వ టెస్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నాడు.
ఈ మ్యాచ్‌కు వేదికైన గాలె ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారత్-శ్రీలంక తొలి టెస్టుతో ఈ మైదానం 50వ మెన్స్ టెస్టుకు ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ఆసియాలో అత్యధిక టెస్టులకు ఆతిథ్యం ఇచ్చిన వేదికగా గాలె స్టేడియం నిలిచింది. పాకిస్థాన్‌లోని కరాచీ నేషనల్ స్టేడియం 47 టెస్టులతో రెండో స్థానంలో ఉండగా.. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ 46 టెస్టులతో తర్వాతి స్థానంలో ఉంది. ఇక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ 43 టెస్టులకు ఆతిథ్యం ఇచ్చింది.
తొలి టెస్టులో భారత్ టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో దేశవాళీ కింగ్ సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం దక్కలేదు. భారత్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు ఎడమచేతివాటం స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ కోటాలో.. రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుతార్ స్పిన్ కోటాలో ఆడుతున్నారు. భారత్ 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (32: 37 బంతుల్లో 5 ఫోర్లు) రనౌట్ అయ్యాడు. ప్రస్తతం భారత్ 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (22), దేవదత్ పడిక్కల్ (20) ఉన్నారు.
అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జట్లు:
1097 - ఇంగ్లాండ్
883 - ఆస్ట్రేలియా
600 - భారతదేశం
596 - వెస్ట్ ఇండీస్
487 - న్యూజిలాండ్




