IND vs IRE 1st T20I: వైభవ్‌కు ఛాన్స్.. మరి ఎవరిపై వేటు.. టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ!
IND vs IRE 1st T20I: Vaibhav Sooryavanshi Debut. ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.
IND vs IRE 1st T20I: వైభవ్‌కు ఛాన్స్.. మరి ఎవరిపై వేటు.. టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ!
IND vs IRE 1st T20I: టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన అనంతరం భారత జట్టు తొలి టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. శుక్రవారం స్టోర్మాంట్ వేదికగా ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్‌తో భారత జట్టుకు కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. శ్రేయస్ అయ్యర్ పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి సిరీస్ కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మాత్రం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.
అరంగేట్రం అవకాశం దక్కుతుందా?:
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో పాటు ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-నేషన్ 'ఏ' సిరీస్‌లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి వైభవ్ సూర్యవంశీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. అతని దూకుడు బ్యాటింగ్ శైలి అభిమానులను ఆకట్టుకుంది.
దీంతో ఐర్లాండ్ సిరీస్‌లో అతడికి అంతర్జాతీయ అరంగేట్రం అవకాశం దక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైభవ్ ఓపెనర్‌గా ఆడుతాడు. అయితే ప్రస్తుతం భారత జట్టులో ఓపెనింగ్ విభాగం బలంగా ఉంది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీ టీ20 ప్రపంచకప్ విజయానికి కీలకంగా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో సంజూ, అభిషేక్, ఇషాన్ కిషన్ ముగ్గురూ అర్ధశతకాలు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు.
బ్యాటింగ్ కూర్పులో మార్పులు చేయాల్సిందే:
అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర టీ20 బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 43 ఇన్నింగ్స్‌ల్లో 1,414 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్‌రేట్ 192.38గా ఉండటం విశేషం. మరోవైపు సంజూ శాంసన్ కూడా ఓపెనర్‌గా 926 పరుగులు చేసి మూడు సెంచరీలు బాదాడు.
ఈ పరిస్థితుల్లో వారిలో ఒకరిని తప్పించడం టీమ్ మేనేజ్మెంట్కు అంత సులభం కాదు. వైభవ్ ప్రతిభపై ఎలాంటి సందేహాలు లేవు. అయితే అతడిని తుది జట్టులోకి తీసుకోవాలంటే భారత జట్టు బ్యాటింగ్ కూర్పులో మార్పులు చేయాల్సి ఉంటుంది. సంజూను మిడిల్ ఆర్డర్‌కు పంపే అవకాశం ఉన్నా.. అక్కడ ఇప్పటికే శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ కీలక స్థానాల్లో ఆడనున్నారు.
బౌలింగ్ సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం:
అలాగే ఆరో స్థానంలో సాధారణంగా ఆల్‌రౌండర్‌కు అవకాశం ఉంటుంది. శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సూర్యాంశ్ షెడ్జే వంటి ఆటగాళ్లు ఆ స్థానానికి పోటీ పడుతున్నారు. వైభవ్ కోసం సంజూను కిందకు పంపితే.. జట్టు బౌలింగ్ సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌కు అందుబాటులో లేని నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ రిస్క్ తీసుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ జట్టులో ఉండటం ఒక సంకేతంగా భావిస్తున్నారు. అతడు తుది జట్టులో లేకపోయినా.. టాప్ ఆర్డర్ బ్యాటర్లపై పోటీ ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ సంజూ లేదా అభిషేక్ ఆశించిన స్థాయిలో రాణించకపోతే.. రెండో మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది.
భారత్ తుది జట్టు (అంచనా):
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్ / వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ.




