IND vs ENG 5th T20I : సౌతాంప్టన్‌లో చేతులెత్తేసిన భారత్.. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం

IND vs ENG 5th T20I : ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆఖరి టీ20 మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో ఓడిపోవడమే కాకుండా, 4-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ ఇచ్చుకుంది.

CR Reddy
Published on: 12 July 2026 6:50 AM IST
IND vs ENG 5th T20I
X

IND vs ENG 5th T20I

IND vs ENG 5th T20I : ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు తీవ్ర అవమానం ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్‌లో జరిగిన ఆఖరి పోరులోనూ టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పరువు కోసం జరిగిన ఈ ఐదో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 56 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దీంతో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు 4-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. కేవలం సిరీస్ కోల్పోవడమే కాకుండా, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ తన నంబర్-1 స్థానాన్ని ఇంగ్లండ్‌కు సమర్పించుకుంది.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత్‌కు కలిసి రాలేదు. సౌతాంప్టన్‌లోని భారీ ట్రాఫిక్ జామ్‌లో భారత జట్టు ప్రయాణిస్తున్న బస్సు చిక్కుకుపోవడంతో ఆటగాళ్లు స్టేడియానికి ఆలస్యంగా చేరుకున్నారు. దీనివల్ల టాస్ వేయడం 45 నిమిషాలు ఆలస్యం కాగా, మ్యాచ్ అరగంట ఆలస్యంగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైంది. ఈ పర్యటనలో వరుసగా టాస్‌లు గెలుస్తున్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇక్కడ కూడా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ గెలిచిన ఆనందం కాసేపు కూడా నిలవలేదు. బౌలర్ల వైఫల్యం, దారుణమైన ఫీల్డింగ్ కారణంగా మైదానంలో టీమిండియాకు పరాభవం తప్పలేదు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (6) వికెట్ పడగొట్టి భారత్ మంచి ఆరంభాన్ని ఇచ్చింది. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్, సీనియర్ ఓపెనర్ జోస్ బట్లర్ కలిసి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 233 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఫామ్‌లో లేని జోస్ బట్లర్ కేవలం 51 బంతుల్లోనే సెంచరీఅ బాదాడు. మొత్తం 64 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేశాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో 45 బంతుల్లో 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

భారత ఫీల్డర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా మూడు క్యాచ్‌లను చేజార్చి ఇంగ్లండ్‌కు భారీ స్కోరు గిఫ్ట్‌గా ఇచ్చారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ శివమ్ దుబే, హ్యారీ బ్రూక్ కేవలం 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేశాడు. ఈ లైఫ్‌తో బ్రూక్ చెలరేగిపోయి భారత్‌కు 92 పరుగుల అదనపు నష్టాన్ని చేకూర్చాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత్‌పై ఒక జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు బ్యాటింగ్‌లో కూడా తడబడింది. ఈ మ్యాచ్ కోసం యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ (27) ఈసారైనా పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని ఆశిస్తే నిరాశపరిచాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (3) పూర్తిగా ఫెయిలయ్యాడు. అయితే ఈ సిరీస్ అంతటా ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన ఇషాన్ కిషన్ (58) బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా మెరుపు బ్యాటింగ్‌తో కేవలం 24 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 రన్స్ చేశాడు. వీరిద్దరూ పోరాడినప్పటికీ రన్ రేట్ ఒత్తిడి కారణంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో 56 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. ఈ ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన మొత్తం 7 టీ20 మ్యాచ్‌లలో భారత్ 6 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story