IND vs PAK: తప్పును అంగీకరించిన పాక్.. పాకిస్థాన్ మహిళల జట్టుకు ఐసీసీ షాక్!
IND vs PAK: టీ20 ప్రపంచకప్ 2026లో ఓటమి బాధలో ఉన్న పాక్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
IND vs PAK: తప్పును అంగీకరించిన పాక్.. పాకిస్థాన్ మహిళల జట్టుకు ఐసీసీ షాక్!
IND vs PAK: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం (జూన్ 14) భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమి బాధలో ఉన్న పాక్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి (స్లో ఓవర్ రేట్) చేయడంలో విఫలమైన కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పాకిస్థాన్‌కు జరిమానా విధించింది.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువగా బౌలింగ్ చేసినట్లు మ్యాచ్ అధికారులు గుర్తించారు. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. జట్టులోని ప్రతి ప్లేయర్ మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించారు. ఈ జరిమానాను ఎమిరేట్స్ ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌కు చెందిన ట్రూడీ ఆండర్సన్ విధించారు.
పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తప్పును అంగీకరించడంతో ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు క్లేర్ పొలోసాక్, జాక్విలిన్ విలియమ్స్, థర్డ్ అంపైర్ ఎలోయిస్ షెరిడన్, ఫోర్త్ అంపైర్ స్యూ రెడ్‌ఫెర్న్ స్లో ఓవర్ రేను నమోదు చేశారు.
ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 106 పరుగులకే కుప్పకూలింది. దాంతో భారత్ 64 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత్ విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కీలక పాత్ర పోషించింది.
అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టిన ఆమె పాకిస్థాన్ బ్యాటింగ్‌ను కుదేలు చేసింది. ముఖ్యంగా చివరి మూడు వికెట్లను కేవలం ఐదు బంతుల వ్యవధిలో తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో మునీబా అలీ 41 పరుగులతో పోరాడినా.. దీప్తి అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో ఆమెను రనౌట్ చేయడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. అనంతరం కెప్టెన్ ఫాతిమా సనా కూడా ఔటవడంతో పాకిస్థాన్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది.
దీప్తి శర్మకు యువ బౌలర్ శ్రీ చరణి మంచి సహకారం అందించింది. ఆమె మూడు కీలక వికెట్లు తీసి పాకిస్థాన్‌పై ఒత్తిడిని మరింత పెంచింది. ఇద్దరి సమిష్టి ప్రదర్శనతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన దీప్తి మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొత్త రికార్డు నెలకొల్పింది.
ప్రస్తుతం ఆమె ఖాతాలో 166 వికెట్లు ఉన్నాయి. గతఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ అద్భుత ప్రదర్శన చేసిన దీప్తి.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ను కూడా ఘనంగా ఆరంభించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఈ విజయంతో శుభారంభం చేసింది. మరోవైపు ఓటమితో పాటు జరిమానా కూడా ఎదురుకావడంతో పాకిస్థాన్ జట్టుపై ఒత్తిడి మరింత పెరిగింది.




