World Cup: 30 సెకన్ల మీటింగ్.. ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా.. సీక్రెట్ చెప్పేసిన భారత కెప్టెన్!

World Cup: తాజాగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2025 వన్డే ప్రపంచ కప్ గురించి ఓ సీక్రెట్ రివీల్ చేసింది.

Rishvik
Published on: 4 Jun 2026 7:37 PM IST
World Cup
X

World Cup: 30 సెకన్ల మీటింగ్.. ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా.. సీక్రెట్ చెప్పేసిన భారత కెప్టెన్!

World Cup: భారత మహిళల క్రికెట్ జట్టు 2025 మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో గెలిచింది. తాజాగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2025 వన్డే ప్రపంచ కప్ గురించి ఓ సీక్రెట్ రివీల్ చేసింది. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మను జట్టులోకి తీసుకున్న విధానంపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గాయపడిన ప్రతికా రావల్ స్థానంలో షఫాలీని జట్టులోకి తీసుకోవాలనే నిర్ణయం కేవలం 30 సెకన్ల సమావేశంలోనే తీసుకున్నామని తెలిపింది. జట్టు సభ్యులు, బీసీసీఐ అధికారులు అందరూ ఏకగ్రీవంగా షఫాలీ పేరునే సూచించారని పేర్కొంది. నిర్ణయమే టీమిండియా విజయానికి కారణం అయిందని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చారు.

బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ప్రతికా రావల్ చీలమండ గాయానికి గురైంది. దీంతో ఆమె నాకౌట్ దశకు దూరమైంది. ఆ సమయంలో ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎంపిక చేయాలనే చర్చ జరగగా.. అందరి నోట ఒకే పేరు వచ్చిందని హర్మన్‌ప్రీత్ వెల్లడించింది. 'ముందుగా ప్రతికా పరిస్థితి గురించి మేం తెలుసుకున్నాం. ఆమె తిరిగి వచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత జరిగిన సమావేశం కేవలం 30 సెకన్లే. అందరూ 'షఫాలీ... షఫాలీ... షఫాలీ' అన్నారు. అంతే ఫైనల్ మ్యాచ్‌లో షఫాలీ ఆడడం ఖరారు అయిపోయింది' అని హర్మన్‌ప్రీత్ చెప్పింది. ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై షఫాలీ అద్భుతంగా ఆడింది. 87 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు తొలి మహిళల వన్డే ప్రపంచకప్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. స్వదేశంలో జరిగిన టోర్నీలో ఈ విజయం భారత మహిళల క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.

టీమ్ హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ మాట్లాడుతూ.. ప్రతికా గాయపడినప్పుడు తీవ్ర ఆందోళనకు గురయ్యానని వెల్లడించాడు. 'ప్రతికా కుంటుకుంటూ మైదానం వీడిన దృశ్యం చూసి నా మనసు కలిచివేసింది. కోచ్‌గా భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి వచ్చింది. కానీ లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు మెదిలాయి' అని చెప్పాడు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కూడా షఫాలీ ఎంపికకు వెంటనే ఓకే చెప్పింది. బిగ్ మ్యాచ్‌ల్లో సీనియర్ ఓపెనర్ అవసరమని, జట్టుకు కావాల్సిన 'ఎక్స్ ఫ్యాక్టర్' షఫాలీ అని తెలిపింది. 'దేశవాళీ క్రికెట్‌లో షఫాలీ అద్భుత ప్రదర్శనలు చేసింది. అందుకే ఆమెను భయపడకుండా తన సహజ ఆట ఆడమని ప్రోత్సహించాను' అని మంధాన వెల్లడించింది.

ఇక షఫాలీ వర్మ తన భావోద్వేగాలను పంచుకుంటూ ప్రపంచ కప్ జట్టులో తొలుత చోటు దక్కకపోవడం జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణాల్లో ఒకటని తెలిపింది. 'భారత్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌కు ఎంపిక కాకపోవడం చాలా బాధ కలిగించింది. అయితే నేను నిరాశ చెందకుండా మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నాను. నా తండ్రి, సోదరుడితో కలిసి సాధనపై దృష్టి పెట్టాను. సూరత్‌లో సీనియర్ మహిళల టీ20 టోర్నీ ఆడుతున్న సమయంలో ప్రపంచ కప్ జట్టులోకి పిలుపు వచ్చింది. హోటల్‌లో స్నేహితురాలితో ఉండగా మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. ప్రతికా గాయపడిందని, వెంటనే జట్టులో చేరాలని చెప్పారు. ఆమెకు గాయం కావడం బాధగా అనిపించినా, ప్రపంచకప్ సెమీఫైనల్ కోసం మానసికంగా సిద్ధం కావాల్సి వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి రావడం అంత సులభం కాదు' అని షఫాలీ వెల్లడించింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న షఫాలీ.. ప్రపంచ కప్ ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో భారత మహిళల క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story