జీటీకి వెళ్లేందుకు హార్దిక్ ఆసక్తి.. ఓకే చెప్పిన కెప్టెన్ గిల్.. కానీ చివరలో ట్విస్ట్!
Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై మరో ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జీటీకి వెళ్లేందుకు హార్దిక్ ఆసక్తి.. ఓకే చెప్పిన కెప్టెన్ గిల్.. కానీ చివరలో ట్విస్ట్!
Hardik Pandya: భారత స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై మరో ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబై నుంచి బయటకు వెళ్లాలని హార్దిక్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ.. అతడు తిరిగి గుజరాత్ టైటాన్స్ (జీటీ)కు వెళ్తాడని ప్రచారం సాగుతోంది. ముందుగా జీటీ యాజమాన్యం సహా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా డీల్‌కు అంగీకరించారని.. హార్దిక్ ఒక కండీషన్ పెట్టడంతోనే చర్చలు ఆగినట్లు తెలుస్తోంది.
2027 ఐపీఎల్ సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యా ట్రేడ్ ద్వారా జట్టు మారేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కూడా అతడి తీసుకునేందుకు ఆసక్తి చూపాయని కథనాలు వచ్చాయి. ఇదే సమయంలో గతంలో ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ టైటాన్స్‌కు తిరిగి వెళ్లేందుకు కూడా హార్దిక్ ఆసక్తి చూపినట్లు సమాచారం. గుజరాత్ కూడా హార్దిక్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావడంపై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ జట్టు ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కూడా చర్చించినట్లు సమాచారం. హార్దిక్ తిరిగి జట్టులో చేరడంపై గిల్ అభ్యంతరం వ్యక్తం చేయలేదని నివేదికలు పేర్కొన్నాయి.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గుజరాత్ టైటాన్స్‌కు తిరిగి రావాలంటే తనకు కెప్టెన్సీ ఇవ్వాలని హార్దిక్ పాండ్యా షరతు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై ఫ్రాంచైజీ యాజమాన్యం సానుకూలంగా స్పందించలేదని, చివరకు హార్దిక్‌ను కెప్టెన్‌గా చేయడానికి ఎవరూ అంగీకరించకపోవడంతో డీల్ ఆగిపోయినట్లు పలు కథనాలు వెల్లడించాయి. 'గుజరాత్ కూడా హార్దిక్ తిరిగి రావడాన్ని స్వాగతించింది. కెప్టెన్ గిల్‌తోనూ చర్చించింది. అయితే హార్దిక్ ఎప్పుడైతే కెప్టెన్సీ షరతు పెట్టాడో ఫ్రాంచైజీ అందుకు ఒప్పుకోలేదు. మేనేజ్మెంట్ కుదరదు అని తెగేసి చెప్పింది' అని జీటీ వర్గాలు తెలిపాయి.
అయితే హార్దిక్ పాండ్యా నేరుగా ఏ ఫ్రాంచైజీతోనూ చర్చలు జరపలేదని అతడి ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ట్రేడ్ లేదా బదిలీకి సంబంధించి ఏదైనా సంప్రదింపులు జరిగి ఉంటే.. అవి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ద్వారానే జరిగాయని తెలిపారు. దీంతో హార్దిక్ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారంలో ఏది వాస్తవం, ఏది చర్చ అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. పాండ్యాకు టైటాన్స్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 2022లో కొత్తగా ఐపీఎల్‌లోకి వచ్చిన గుజరాత్ జట్టుకు హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించి తొలి సీజన్లోనే టైటిల్ అందించాడు. ఆ తర్వాతి సీజన్లోనూ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే 2024 సీజన్‌కు ముందు హార్దిక్ మళ్లీ ముంబై ఇండియన్స్‌కు చేరాడు.
ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడం ముంబై అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గుజరాత్లో కెప్టెన్‌గా పొందిన ఆదరణతో పోలిస్తే.. ముంబైలో హార్దిక్‌కు అదే స్థాయి మద్దతు లభించలేదు. 2026 ఐపీఎల్ సీజన్ అనంతరం ముంబై తమ జట్టును పునర్నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లను కొనసాగించడంపై కోచింగ్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2027 వేలానికి ముందు హార్దిక్ సహా పలువురు సీనియర్ ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ హార్దిక్ నిజంగానే ముంబైని వీడితే.. 2027 ఐపీఎల్‌కు ముందు అతడు ఏ జట్టులో చేరతాడన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.




