Hardik Pandya: బ్యాటర్ల తప్పేం లేదు, అంతా బౌలర్లే చేశారు.. ముంబై ఓటమిపై హార్దిక్ సంచలన వ్యాఖ్యలు!

Hardik Pandya Blames Bowlers. ముంబై ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందిస్తూ బౌలింగ్ విభాగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఓటమికి బ్యాటర్ల తప్పేం లేదని, మొత్తం బౌలర్లదే అని పేర్కొన్నాడు.

Rishvik
Published on: 8 April 2026 1:00 PM IST
Hardik Pandya
X

Hardik Pandya

Hardik Pandya: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో ముంబై 123 పరుగులకే పరిమితమైంది. ముంబై ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందిస్తూ బౌలింగ్ విభాగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఓటమికి బ్యాటర్ల తప్పేం లేదని, మొత్తం బౌలర్లదే అని పేర్కొన్నాడు. పవర్‌ప్లేలో మంచి బంతులు వేయలేకపోయామని, అదే మ్యాచ్‌లో పెద్ద తప్పిదం అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. కనీసం 5-6 మంచి బంతులేసినా తమకు గెలిచే ఛాన్స్‌ ఉండేదని నిరాశ వ్యక్తం చేశాడు.

'ఈ మ్యాచ్‌ ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. పూర్తిగా బౌలింగ్ యూనిట్‌దే బాధ్యత. టీ20లో కొన్ని సరైన బంతులు వేయడం చాలా ముఖ్యం. 27 పరుగుల తేడా ఓటమి అంటే చిన్నదే. కేవలం కొన్ని మంచి బంతులు, కొన్ని సిక్సర్లు కొడితే సరిపోయేది. మేము మా ప్రణాళికలను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే మ్యాచ్‌లో గెలిచే వాళ్లం. మేం బౌలింగ్‌లోనే రాణించలేదు. నాతో పాటు మా బౌలింగ్‌ బృందం మొత్తం విఫలమైంది. కనీసం 5-6 సిక్సర్లు వెళ్లకుండా కట్టడి చేయాల్సింది. అలా చేస్తే మేం పోరాడేందుకు అవకాశం లభించేది' అని హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు.

వైభవ్ సూర్యవంశీపై హార్దిక్ పాండ్య ప్రశంసలు కురిపించాడు. '16-17 ఏళ్ల కుర్రాడు ఇలా నిర్భయంగా ఆడటంను చూడటం అద్భుతంగా ఉంది. మ్యాచ్‌కు ముందు కూడా అతని గురించి చర్చించాం. అతని షాట్స్, ఆత్మవిశ్వాసం గొప్పగా ఉన్నాయి. భవిష్యత్తులో అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాను, జైస్వాల్ కూడా బాగా ఆడాడు. ఇద్దరు కలిసి రెండు ఓవర్లలోనే గేమ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు మేం ప్రయత్నించినా వెనకబడిపోయాం' అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. 'రేపు మరలా కొత్త రోజు. ఆ తప్పులను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాలి. తదుపరి మ్యాచ్‌లో గెలిచి తిరిగి ట్రాక్‌లోకి రావాలి' అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story