India vs Afghanistan: వామ్మె ఇదేందయ్యా.. టీమిండియాలో మొత్తం గుజరాత్ ఆటగాళ్లే..!
India vs Afghanistan: ఐపీఎల్ ముగిసిన కేవలం 5 రోజులకే టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది.
India vs Afghanistan: వామ్మె ఇదేందయ్యా.. టీమిండియాలో మొత్తం గుజరాత్ ఆటగాళ్లే..!
Gujarat Titans : ఐపీఎల్ 2026 ముగిసి వారం కూడా కాలేదు.. అప్పుడే టీమిండియా వైట్-బాల్ మూడ్ నుంచి రెడ్-బాల్ క్రికెట్‌కు మారబోతోంది. నేటి నుంచి మూలాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు భారత జట్టు సర్వం సిద్ధమైంది. అయితే, ఐపీఎల్ ముగిసిన కేవలం ఐదు రోజులకే ఈ మ్యాచ్ ఆడుతుండటంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్, మానసిక సన్నద్ధతపై మేనేజ్‌మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్ ఆడిన గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సహా ఏడుగురు ఆటగాళ్లు ఈ టెస్ట్ స్క్వాడ్‌లో ఉండటమే ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్ ముందున్న అతిపెద్ద సవాల్ అని భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే అంగీకరించారు.
ప్రస్తుతం జట్టు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి డస్కాటే విలేకరుల సమావేశంలో కీలక విషయాలు పంచుకున్నారు. టీ20 ఫార్మాట్ నుంచి టెస్టులకు మారడం ఆటగాళ్లకు పెద్ద పరీక్ష. కేవలం ఐదు రోజుల్లోనే ఆటగాళ్ల నిద్ర సమయాలు మార్చడం, వైట్-బాల్ అలవాట్ల నుంచి బయటపడటం, టెస్ట్ టెక్నిక్‌కు తగ్గట్టుగా మారడంపై దృష్టి పెట్టాం అని ఆయన వివరించారు. టీమిండియాకు ఊరటనిచ్చే విషయమేమిటంటే.. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నెట్స్‌లో పూర్తి ఫిట్‌నెస్‌తో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడని, అతను ఆడటం ఖాయమని కోచ్ స్పష్టం చేశారు.
ఈ మ్యాచ్‌లో సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతినివ్వడంతో స్పిన్ బాధ్యతలను ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. స్పిన్ పిచ్‌పై కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు తుది జట్టులో ఆడటం దాదాపు ఖాయమైంది. పిచ్ పరిస్థితులను బట్టి మూడో స్పిన్నర్ స్థానం కోసం దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన హర్ష్ దూబే, మానవ్ సుతార్‌ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. వీరిద్దరిలో ఒకరికి టెస్ట్ క్యాప్ దక్కే అవకాశం ఉంది.
భారత టెస్ట్ జట్టులో అత్యంత కీలకమైన నెం.3 బ్యాటింగ్ స్థానం ఇంకా అస్థిరంగానే ఉందని డస్కాటే ఒప్పుకున్నారు. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల దృష్ట్యా ఈ స్థానంలో స్థిరత్వం రావాల్సి ఉందన్నారు. దేశవాళీ క్రికెట్‌లో రాణించిన దేవదత్ పడిక్కల్, ఐపీఎల్‌లో మెరిసిన సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వారి నైపుణ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది" అని డస్కాటే పేర్కొన్నారు. సవాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ, భారత ఆటగాళ్లు చూపిస్తున్న వృత్తి నైపుణ్యం అద్భుతమని అసిస్టెంట్ కోచ్ ప్రశంసించారు. మరి ఐపీఎల్ జోష్ నుంచి టెస్ట్ మోడ్‌లోకి మారిన టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్‌పై ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.
టీమిండియాలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు వీరే..
1. శుభ్‌మన్ గిల్
2. సాయి సుదర్శన్
3. వాషింగ్టన్ సుందర్
4. మహమ్మద్ సిరాజ్
5. ప్రసిద్ధ్ కృష్ణ
6. మానవ్ సుతార్
7. గుర్నూర్ బ్రార్




