GT vs CSK : గుజరాత్ దెబ్బకు చెన్నై ప్యాకప్.. ఐపీఎల్ 2026 నుంచి అవుట్
GT vs CSK : ఐపీఎల్ 2026 లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 89 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో చెన్నై టోర్నీ నుండి నిష్క్రమించింది.
GT vs CSK
GT vs CSK : ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన రుతురాజ్ ఆర్మీ.. కేవలం 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. 89 పరుగుల తేడాతో ఘోర విజయాన్ని అందుకున్న గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానానికి దూసుకెళ్లగా, చెన్నై సూపర్ కింగ్స్ టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
టాస్ గెలిచినా కలిసిరాని అదృష్టం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, హోమ్ గ్రౌండ్‌లో గుజరాత్ ఓపెనర్లు చెన్నై బౌలర్లను ఆటాడుకున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మొదటి ఓవర్ నుంచే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 12.2 ఓవర్లలోనే 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ 37 బంతుల్లో 64 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 53 బంతుల్లో 84 పరుగులతో చెన్నై బౌలింగ్ లైనప్‌ను ముక్కలు చేశాడు.
ఆఖరిలో జోస్ బట్లర్ విధ్వంసం
ఓపెనర్లు ఇచ్చిన భారీ పునాదితో మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ మరింత రెచ్చిపోయాడు. కేవలం 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి చెరో వికెట్ తీసినప్పటికీ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు.
సిరాజ్ బౌలింగ్ దాడి..
230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రారంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన మొదటి రెండు ఓవర్లలోనే చెన్నై టాప్ ఆర్డర్‌ను క్లీన్ స్వీప్ చేశాడు. మొదటి ఓవర్ లోనే సంజూ శాంసన్‌ను డకౌట్ చేసిన సిరాజ్, ఆ తర్వాత ఓవర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (16 పరుగులు), ఉర్విల్ పటేల్ (0)లను పెవిలియన్ పంపాడు. కేవలం రెండు ఓవర్ల వ్యవధిలోనే 3 వికెట్లు తీసి చెన్నై జట్టు పతనాన్ని శాసించాడు.
శివమ్ దూబే మెరుపులు వృథా
ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 17 బంతుల్లోనే 47 పరుగులతో చెన్నై క్యాంప్‌లో కాస్త ఆశలు రేపాడు. అయితే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ పట్టిన అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో దూబే ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత కగిసో రబాడా, రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లతో చెన్నై తోక ముడిపించారు. డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ షార్ట్ లాంటి హిట్టర్లు విఫలం కావడంతో చెన్నై జట్టు 140 పరుగులకే ఆల్‌అవుట్ అయి టోర్నీ నుంచి వైదొలిగింది.




