Glenn Phillips: అంతర్జాతీయ టీ20ల్లో తోపు.. ఐపీఎల్‌లో మాత్రం అట్టర్ ప్లాఫ్!

Glenn Phillips IPL Struggles: ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో గ్లెన్‌ ఫిలిప్స్‌ చర్చనీయాంశంగా మారాడు. న్యూజిలాండ్‌కు చెందిన ఈ స్టార్ ఆల్‌రౌండర్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

Rishvik
Published on: 31 March 2026 11:16 PM IST
Glenn Phillips IPL Struggles: T20 Star Fails to Deliver in IPL 2026 for Gujarat Titans
X

Glenn Phillips

Glenn Phillips: న్యూజిలాండ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఆటగాళ్లలో ఫీల్డింగ్‌లో అతడిని మించిని వాడే లేడు. కవర్ పాయింట్, బౌండరీల వద్ద ఎక్కువగా ఫీల్డింగ్ చేసే ఫిలిప్స్‌.. ఎన్నో కళ్లుచెదిరే క్యాచ్‌లు అందుకున్నాడు. బ్యాటింగ్‌లో కూడా పరుగుల వరద పారిస్తుంటాడు. కివీస్ తరపున 97 మ్యాచ్‌ల్లో 2286 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 12 అర్ధ శతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో దుమ్ములేపే ఫిలిప్స్‌.. ఐపీఎల్‌లో మాత్రం అట్టర్ ప్లాఫ్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.

ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో గ్లెన్‌ ఫిలిప్స్‌ చర్చనీయాంశంగా మారాడు. న్యూజిలాండ్‌కు చెందిన ఈ స్టార్ ఆల్‌రౌండర్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అతడి బ్యాటింగ్ గణాంకాలు చూస్తే.. ఐపీఎల్‌లో ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో స్పష్టంగా తెలుస్తోంది. ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన ఫిలిప్స్‌.. కేవలం 90 పరుగులు మాత్రమే సాధించాడు. సగటు 11.25గా ఉండటం అతడి స్థాయికి చాలా తక్కువ. స్ట్రైక్ రేట్ 125 ఉన్నప్పటికీ.. జట్టుకు అవసరమైన సమయంలో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. ఐపీఎల్‌లో గ్లెన్‌ స్కోర్ వరుసగా.. 14 నాటౌట్, 4, 8, 8, 25, 0, 5, 1, 25గా ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్‌లో అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

ఐపీఎల్ 2026లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడుతున్న గ్లెన్‌ ఫిలిప్స్‌.. ఈరోజు పంజాబ్ కింగ్స్‌పై తేలిపోయాడు. 17 బంతుల్లో 25 రన్స్ చేశాడు. జయ్‌కుమార్‌ వైశాఖ్‌ బౌలింగ్‌లో (13.6) మార్కో యాన్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మిడిల్ ఆర్డర్‌లో బాధ్యత తీసుకోవాల్సిన సమయంలో ఫిలిప్స్ విఫలమవడం జట్టుపై ప్రభావం చూపింది. కీలక మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే అవుట్ అవుతూ జట్టును ఒత్తిడిలోకి నెడుతున్నాడు. ఫాన్స్, టీమ్ అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఫిలిప్స్ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడు తిరిగి ఫామ్‌లోకి రావడం పెద్ద కష్టం కాదు. ఒక్క మంచి ఇన్నింగ్స్‌తోనే మళ్లీ తన రిథమ్‌ను అందుకునే సామర్థ్యం అతడికి ఉంది. రాబోయే మ్యాచ్‌ల్లో అతడు ఎలా రాణిస్తాడో చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story