Sunil Gavaskar: రోహిత్ ఫామ్‌లో ఉంటే దబిడిదిబిడే.. ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతే!
Sunil Gavaskar: లక్నోతో జరిగిన మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన రోహిత్ బ్యాటింగ్‌పై గావస్కర్ ప్రశంసలు కురిపించారు.
Sunil Gavaskar: రోహిత్ ఫామ్‌లో ఉంటే దబిడిదిబిడే.. ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతే!
Sunil Gavaskar: ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 44 బంతుల్లోనే 84 పరుగులు చేసి.. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. తనదైన శైలిలో సిక్సర్లు, ఫోర్లతో అలరించిన రోహిత్.. మళ్లీ పాత ఫామ్‌ను అందిపుచ్చుకోవడం అభిమానుల్లో జోష్ నింపింది. లక్నోతో జరిగిన మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన రోహిత్ బ్యాటింగ్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ తన బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి సారించాడని అభిప్రాయపడ్డారు.
'గత ఏడాదిగా రోహిత్ శర్మ ఆటను గమనిస్తున్నాను. అతడు ఇప్పుడు స్వేచ్ఛగా ఆడుతున్నాడు. సాధారణంగా హిట్‌మ్యాన్ ప్రతి సీజన్లో 400-500 పరుగులు చేస్తాడు. కానీ అందులో 80కి పైగా పరుగులు చేసే ఇన్నింగ్స్‌లు తక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు అతను కేవలం మెరుపు ఆరంభాలకే పరిమితం కాకుండా.. క్రీజులో ఎక్కువ సేపు ఉండి భారీ స్కోర్లు సాధించాలని చూస్తున్నాడు.
ఇది ప్రత్యర్థి జట్లకు ప్రమాద సంకేతం. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పట్టికలో ఆరు పాయింట్లతో వెనుకబడి ఉంది. ప్లేఆఫ్స్ అవకాశాలు ముంబైకి తక్కువగా ఉన్నప్పటికీ.. రోహిత్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఇతర జట్ల అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. లీగ్ ఆఖరి దశలో ముంబై పవర్ ఫుల్ ప్రత్యర్థిగా మారుతుంది. మిగిలిన మ్యాచ్‌లలో గెలిచి ఇతర జట్ల సమీకరణాలను తారుమారు చేయగలదు' అని సునీల్ గావస్కర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 10 మ్యాచులలో మూడు విజయాలు మాత్రమే అందుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంఐ ప్లేఆఫ్స్ చేరాలంటే ఒక అద్భుతం జరగాలి. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ (ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్, ఆర్ఆర్) తప్పక గెలవాలి. కేవలం గెలవడమే కాకుండా.. ఇతర జట్ల ఓటములపై ముంబై ఆశలు పెట్టుకోవాలి. మరోవైపు ఈ సీజన్లో ఇప్పటివరకు రోహిత్ శర్మ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 174.02 స్ట్రైక్‌రేట్‌తో 221 పరుగులు చేశాడు. లీగ్ చివరి వరకు హిట్‌మ్యాన్ ఇదే జోరును కొనసాగించాలని ముంబై యాజమాన్యం సహా అభిమానులు ఆశిస్తున్నారు. హిట్‌మ్యాన్ ఫామ్‌లో ఉంటే మిగతా జట్లకు దబిడిదిబిడే. ముంబైతో తప్పక గెలవాల్సిన జట్లకు ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతే అని చెప్పాలి.




