IPL 2026: చాట్‌జీపీటీతో కోహ్లీ మ్యాచ్ ఫేక్ టికెట్లు తయారు చేసిన ముఠా

ఐపీఎల్‌ మ్యాచ్‌ వద్ద చాట్‌జీపీటీ సాయంతో ఫేక్ టికెట్లు తయారు చేసిన ముఠాను లక్నో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Ramya Vegirouthu
Published on: 9 May 2026 10:40 AM IST
Fake AI IPL Tickets Busted During LSG vs RCB Match
X

Fake AI IPL Tickets Busted During LSG vs RCB Match

ఐపీఎల్‌ 2026లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో నకిలీ ఐపీఎల్‌ టికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను లక్నో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఎకానా స్టేడియం వద్ద గురువారం జరిగిన ఎల్‌ఎస్‌జీ-ఆర్‌సీబీ మ్యాచ్‌ సమయంలో నలుగురు వ్యక్తులు ఫేక్ టికెట్లు అమ్ముతున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు చాట్‌జీపీటీతో పాటు గ్రాఫిక్‌ డిజైన్‌ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి నకిలీ టికెట్లు తయారు చేసినట్లు వెల్లడైంది.

లక్నో సౌత్‌ డీసీపీ అమిత్‌కుమార్‌ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్టేడియం బయట ఓ వ్యక్తి వద్ద ఫేక్‌ టికెట్‌ బయటపడటంతో పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం సైబర్ సెల్‌, సుషాంత్‌ గోల్ఫ్‌సిటీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 9 పరుగుల తేడాతో ఆర్‌సీబీపై విజయం సాధించింది. మిచెల్‌ మార్ష్‌ 56 బంతుల్లో 111 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, రిషభ్‌ పంత్‌ వేగంగా 32 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ తరఫున రాజత్‌ పాటిదార్‌ పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.




Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story