టీమిండియా బౌలర్లపై విధ్వంసం.. లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్లు.. 46 ఏళ్ల రికార్డు బద్దలు!

England vs India: Ben Duckett and Jacob Bethell rewrite the record books. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెతెల్ చరిత్ర సృష్టించారు.

Rishvik
Published on: 19 July 2026 6:06 PM IST
England vs India
X

టీమిండియా బౌలర్లపై విధ్వంసం.. లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్లు.. 46 ఏళ్ల రికార్డు బద్దలు!

England vs India: ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెతెల్ చరిత్ర సృష్టించారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో వన్డేల్లో తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా నిలిచారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఈ రికార్డు డకెట్-బెతెల్ ఖాతాలో చేరింది. ఈ భాగస్వామ్యంతో ఎన్నో ఏళ్ల నాటి రికార్డులను వీరిద్దరు బద్దలు కొట్టారు. ఈ అద్భుత భాగస్వామ్యంతో భారత్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్.. సిరీస్ డిసైడర్‌లో బలమైన స్థితిలోకి చేరుకుంది.

లార్డ్స్‌లో వన్డే చరిత్రలో బెన్ డకెట్, జాకబ్ బెతెల్ కలిసి చేసిన పరుగులే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యంగా నిలిచింది. గతంలో 1980లో వెస్టిండీస్‌పై జెఫ్రీ బాయ్‌కాట్-పీటర్ విల్లీ జోడీ నెలకొల్పిన 135 పరుగుల రికార్డును డకెట్-బెతెల్ జంట అధిగమించింది. దాదాపు 46 ఏళ్లుగా చెక్కుచెదరని ఆ రికార్డు ఇప్పుడు కనుమరుగయిపోయింది.

అంతేకాదు 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఇంగ్లండ్ తరఫున ఒకే వన్డేలో ఇద్దరు ఓపెనర్లు అర్ధశతకాలు నమోదు చేయడం ఇది రెండోసారి మాత్రమే. గత ఏడాది వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ డకెట్, జేమీ స్మిత్ ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు డకెట్, బెతెల్ అదే జోరును కొనసాగించారు. ఇక లార్డ్స్ వేదికగా ఇద్దరు ఇంగ్లండ్ ఓపెనర్లు అర్ధ శతకాలు చేయడం 1998లో నిక్ నైట్, మైక్ అథర్టన్ తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.

భారత్‌పై వన్డేల్లో ఇంగ్లండ్‌కు తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాల జాబితాలో కూడా బెన్ డకెట్, జాకబ్ బెతెల్ జోడీ అగ్రస్థానంలో నిలిచింది. వీరి 192 పరుగుల భాగస్వామ్యం.. 2019లో ఎడ్జ్‌బాస్టన్‌లో జేసన్ రాయ్-జానీ బెయిర్‌స్టో నెలకొల్పిన 160 పరుగుల రికార్డును అధిగమించింది. అలాగే 2013లో రాజ్‌కోట్‌లో అలిస్టర్ కుక్-ఇయాన్ బెల్ చేసిన 158 పరుగులు, 2021లో పుణెలో రాయ్-బెయిర్‌స్టో సాధించిన 135 పరుగుల భాగస్వామ్యాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టీమిండియా బౌలర్లపై విధ్వంసం సృష్టించిన డకెట్-బెతెల్ జోడి రికార్డుల మీద రికార్డులు నెలకొల్పింది.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 30.1 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 192 పరుగులు చేసింది. బెన్ డకెట్ 88 బంతుల్లో 81 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా జో రూట్ ఉన్నాడు. జాకబ్ బెతెల్ 93 బంతుల్లో 91 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొదటి వికెట్ కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.

ఎట్టకేలకు 192 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సెంచరీ చేసేలా కనిపించిన బెతెల్.. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 30.1 ఓవర్‌కు డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ జోరు చూస్తే ఇంగ్లండ్ స్కోర్ 300 దాటేలా ఉంది. ఇప్పటికైనా భారత బౌలర్లు పుంజుకుంటే.. భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోవచ్చు. చూడాలి మరి భారత బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story