England Club Cricket: క్రికెట్‌లో చీటింగ్ కలకలం.. చిటికె వేసి బ్యాటర్‌ను అవుట్ చేసిన ఫీల్డర్.. వీడియో వైరల్!

England Club Cricket: England Club Cricket Cheating Row. క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ లేని ఘరానా మోసం ఒకటి బయటపడింది.

Rishvik
Published on: 28 July 2026 8:19 PM IST
England Club Cricket
X

England Club Cricket: క్రికెట్‌లో చీటింగ్ కలకలం.. చిటికె వేసి బ్యాటర్‌ను అవుట్ చేసిన ఫీల్డర్.. వీడియో వైరల్!

England Club Cricket: సాధారణంగా మనం క్రికెట్ మైదానంలో బాల్ టాంపరింగ్, ఫేక్ ఫీల్డింగ్ వంటివి చూస్తుంటాం. కానీ క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ లేని ఘరానా మోసం ఒకటి బయటపడింది. ఓ ఫీల్డర్ ‘ఫేక్ ఎడ్జ్’ ద్వారా అంపైర్‌ను బురిడీ కొట్టించి.. బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇది ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ చీటింగ్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ డివిజన్-2లో సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్, మిడిల్స్‌బ్రో క్రికెట్ క్లబ్ సెకండ్ ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాటర్ బ్యాట్‌కు బంతి తగల్లేదని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు వేలితో చిటికె వేసి 'ఎడ్జ్' అయినట్లు శబ్దం చేశాడు. సాల్ట్‌బర్న్ జట్టు ఫీల్డర్ సరిగ్గా బంతి బ్యాట్‌ను దాటే సమయంలో తన వేళ్లతో గట్టిగా చిటికె వేశాడు. బంతి వెళ్లి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. అయితే ఆ చిటికె శబ్దాన్ని బంతి బ్యాట్ అంచుకు తగిలిన శబ్దంగా భావించిన అంపైర్.. బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనను స్థానిక క్రికెటర్ బెన్ మమ్మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. 'క్రికెట్‌లో నేను చూసిన అత్యంత దారుణమైన చీటింగ్ ఇదే. ఇలానే సాల్ట్‌బర్న్ వికెట్‌కీపర్ ఈ సీజన్‌లో చాలా క్యాచ్‌లు పట్టాడని ఇప్పుడు అర్థమవుతోంది' అంటూ విమర్శించాడు. ఈ ఆరోపణలపై మిడిల్స్‌బ్రో కెప్టెన్ రోరీ కాటెరిల్ స్పందించాడు. ఇదొకటే కాదని, అదే మ్యాచ్‌లో మరో రెండు సార్లు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఆరోపించాడు. 15, 16 ఏళ్ల యువ ఆటగాళ్లు కూడా ఇలాంటి మోసానికి పాల్పడుతున్నారని, తాను నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా ఈ ఘటనలు ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నాడు. చివరకు తమ జట్టు 29 పరుగుల తేడాతో ఓడిపోయిందని, ఈ ఘటనలు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ వివాదంపై నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు అందిందని, పూర్తి స్థాయి విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది. విచారణ పూర్తయ్యే వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని లీగ్ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో క్లబ్ క్రికెట్‌లో నైతిక విలువలు, అంపైరింగ్ ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై క్రికెట్ అభిమానులు స్పందిస్తూ.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story