MS Dhoni: కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి కూడా తెలియదు.. ధోనీ రీఎంట్రీపై మాజీల ఆసక్తికర వ్యాఖ్యలు!

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానులకు ఐపీఎల్ 2026 సీజన్ తీవ్ర నిరాశను మిగిల్చింది.

Rishvik
Published on: 25 May 2026 7:03 PM IST
MS Dhoni
X

MS Dhoni: కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి కూడా తెలియదు.. ధోనీ రీఎంట్రీపై మాజీల ఆసక్తికర వ్యాఖ్యలు!

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానులకు ఐపీఎల్ 2026 సీజన్ తీవ్ర నిరాశను మిగిల్చింది. సీఎస్‌కే వరుసగా మూడోసారి ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమయింది. అంతేకాదు అభిమానుల ఆరాధ్య దైవం, తలా ఎంఎస్ ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం పెద్ద షాక్‌గా మారింది. 44 ఏళ్ల ధోనీ గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో ఐదు సార్లు ఛాంపియన్ అయిన సీఎస్‌కే.. ఈ సీజన్‌లో కేవలం ఆరు విజయాలకే పరిమితమై పాయింట్ల పట్టికలో దిగువన నిలిచింది. ఐపీఎల్ 2026లో సీఎస్‌కే ప్రయాణం ముగియడంతో ధోనీ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది.

టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2027లో మరోసారి సీఎస్‌కే తరఫున బరిలోకి దిగే అవకాశం ఉందని జహీర్ అంచనా వేశాడు. ఓ ప్రముఖ క్రికెట్ షోలో మాట్లాడిన జహీర్.. వచ్చే మెగా వేలానికి ముందు ధోనీ మరోసారి ఆడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని తెలిపాడు. సీఎస్‌కే ప్రస్తుతం యువ ఆటగాళ్లపై భారీగా పెట్టుబడి పెడుతోందని, జట్టును భవిష్యత్తుకు సిద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోందని చెప్పాడు. ‘ఆఫ్ సీజన్‌లో ధోనీ తన శరీర పరిస్థితిని పరిశీలిస్తాడు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాడు. సీఎస్‌కే యువ ఆటగాళ్లను ప్రోత్సహించే దిశగా ముందుకెళ్తోంది. గతంలో ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగేందుకు కూడా ఫ్రాంచైజీ ప్రయోజనాల కోసమే. భవిష్యత్తులో జట్టును ముందుకు నడిపించే ఆటగాడు దొరికితే.. ధోనీ మళ్లీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’ అని జహీర్ పేర్కొన్నాడు.

'వచ్చే సీజన్ ఎంఎస్ ధోనీకి చాలా కీలకం కావచ్చు. మెగా వేలానికి ముందు మరోసారి సీఎస్‌కేకు ఆడాలని భావించే అవకాశం ఉంది. ధోనీని ఇప్పుడు అడిగినా.. ఆఫ్ సీజన్ ఎలా ఉంటుందో చూద్దాం అనే సమాధానమే చెబుతాడు. ప్రతి ఏడాది అతడు ఇదే చెబుతుంటాడు’ అని జహీర్ ఖాన్ అన్నాడు. మరోవైపు మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ కూడా ధోనీ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎంఎస్ ధోనీ గురించి ఒక విషయం మాత్రం ఖాయంగా తెలుసు. అతడు ఏం ఆలోచిస్తున్నాడో ఎవరికీ తెలియదు. తన కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి కూడా తెలియనివ్వడు. మనం ఎంత చర్చించినా ధోనీ మనసులో ఏముందో అంచనా వేయడం చాలా కష్టం’ అని కార్తీక్ చెప్పుకొచ్చాడు.

ఎంఎస్ ధోనీ రీఎంట్రీపై వస్తున్న ఈ వార్తలు ఇప్పుడు సీఎస్‌కే అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఐపీఎల్‌లో మాత్రం ఇంకా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. మరి 2027లో నిజంగానే మరోసారి పసుపు జెర్సీలో మైదానంలోకి దిగుతాడా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీడ్కోలు చెప్పినా.. సీఎస్‌కే కోచ్ లేదా మెంటార్‌గా అయినా మహీ ఉండాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ధోనీ సీఎస్‌కేలో భాగం అయితే చాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story