Devdutt Padikkal: అప్పుడు పెర్త్, ఇప్పుడు గాలె.. కఠినమైన పిచ్‌లలో ఆడా.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
Devdutt Padikkal: తన కెరీర్‌లో ఆడిన టెస్టు మ్యాచ్‌ల వేదికలు ఎంతో సవాలుగా ఉన్నప్పటికీ, ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం తనకు ఆనందంగా ఉందని పడిక్కల్ చెప్పాడు.
Devdutt Padikkal: అప్పుడు పెర్త్, ఇప్పుడు గాలె.. కఠినమైన పిచ్‌లలో ఆడా.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
Devdutt Padikkal: గాలె మైదానంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత టెస్టు చరిత్రలో 600వ మ్యాచ్‌గా నిలిచిన ఈ పోరులో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగుల భారీ శతకం బాదిన పడిక్కల్.. రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం పడిక్కల్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఆడిన టెస్టు మ్యాచ్‌ల వేదికలు ఎంతో సవాలుగా ఉన్నప్పటికీ, ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం తనకు ఆనందంగా ఉందని చెప్పాడు.
'ధర్మశాలలో నా టెస్టు అరంగేట్రం జరిగింది. ఆ తర్వాత పెర్త్‌లో టెస్టు ఆడాను. ఇప్పుడు గాలెలో ఆడాను. ఇవన్నీ కఠినమైన వేదికలే. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ నేను బాగా ఆడాను. ఇంతకంటే మంచి ఆరంభం ఉంటుందా?. ఈ టెస్టులను నేను మర్చిపోలేను. గాలెలో భారత్ అద్భుతమైన క్రికెట్ ఆడింది. భారత టెస్టు చరిత్రలో 600వ మ్యాచ్ ఇది. ఈ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రదర్శనపై చాలా సంతృప్తిగా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఐయామ్ ఫుల్ హ్యాపీ' అని దేవదత్ పడిక్కల్ సంతోషం వ్యక్తం చేశాడు.
గాలె పిచ్ ఐదు రోజుల పాటు ఎలా మారిందనే ప్రశ్నకు స్పందించిన దేవదత్ పడిక్కల్.. పిచ్‌లో సహజమైన మార్పులు వచ్చినప్పటికీ, మొత్తంగా అది మంచి టెస్టు వికెట్‌గా ఉందని పేర్కొన్నాడు. 'గాలెలో వికెట్ సహజంగా మారిపోయింది. మూడో రోజు నుంచి బంతి ఎక్కువగా టర్న్ అవ్వడం ప్రారంభించింది. అయినప్పటికీ ఐదు రోజుల పాటు ఇది మంచి టెస్టు వికెట్‌గానే ఉంది. ఈ పిచ్‌లో ఎవరు బాగా ఆడితే వారిదే విజయం. ఆ విషయంలో మేము బాగా రాణించాం' అని పడిక్కల్ వివరించాడు. గాలె పిచ్‌పై లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు ఎక్కువ ప్రయోజనం లభించిందా? అనే ప్రశ్నకు పడిక్కల్ స్పందించాడు. ప్రత్యేకంగా ఎడమచేతి బ్యాటర్లకు అనుకూలంగా పిచ్ ఉందని చెప్పలేమని పేర్కొన్నాడు. అయితే శ్రీలంక బౌలింగ్‌లో ఎక్కువగా ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఉండటం, పిచ్ నెమ్మదిగా ఉండటంతో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు వారిని ఎదుర్కోవడం కొంత సులభంగా మారిందని తెలిపాడు.
'గాలె పిచ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు ప్రత్యేకంగా అనుకూలమైన వికెట్ అని నేను అనుకోను. అయితే ఎడమచేతి స్పిన్నర్లు ఎక్కువగా బౌలింగ్ చేయడం, వికెట్ కొంత నెమ్మదిగా ఉండటం కారణంగా వారిని ఎదుర్కోవడం లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు కొంత సులభమైంది. బంతికి పిచ్ నుంచి ఎక్కువగా బైట్ లభించకపోవడం కూడా అందుకు కారణం' అని పడిక్కల్ చెప్పాడు. ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. పడిక్కల్ 167 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడగా.. కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురెల్ 51 పరుగులతో రాణించారు. అనంతరం శ్రీలంక 284 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత్‌కు 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రిషభ్ పంత్ 66, పడిక్కల్ 44, కేఎల్ రాహుల్ 35 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఏకంగా 10 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.




