DC vs KKR: 47 బంతుల్లోనే శతక్కొట్టిన ఫిన్ అలెన్.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
DC vs KKR: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫిన్ అలెన్ 47 బంతుల్లోనే మెరుపు సెంచరీతో కేకేఆర్ కు వరుసగా నాలుగో గెలుపు.
DC vs KKR
DC vs KKR: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 51వ ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ ఊచకోత కోసింది. కివీస్ స్టార్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదడంతో, కేకేఆర్ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ రహానే మొదట బౌలింగ్ ఎంచుకొని సరైన నిర్ణయం తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఆశించిన రీతిలో ఆడలేకపోయారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ మొత్తం మీద 51 డాట్ బంతులు ఆడటం వారి స్కోరును దెబ్బతీసింది. పథుమ్ నిస్సాంక (50), కెఎల్ రాహుల్ (23), ఆశుతోష్ శర్మ (39) తప్ప మిగిలిన వారెవరూ నిలబడలేదు. దీనివల్ల ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో అనుకూల్ రాయ్, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశారు.
కేవలం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు ఓపెనర్ ఫిన్ అలెన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఏ దశలోనూ ఢిల్లీ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి ఐపీఎల్ లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇందులో 10 భారీ సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తో కేకేఆర్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్ గా అలెన్ చరిత్ర సృష్టించాడు.
అలెన్ కి తోడుగా కేమరూన్ గ్రీన్ (33 నాటౌట్) నిలకడగా ఆడటంతో కేకేఆర్ మరో 34 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్క వికెట్ తీయగా, మిగిలిన బౌలర్లు అలెన్ ధాటికి తేలిపోయారు. కేవలం 14.2 ఓవర్లలోనే 147 పరుగులు చేసి కేకేఆర్ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో కేకేఆర్ నెట్ రన్ రేట్ కూడా అమాంతం పెరిగింది.
ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ రేసులో తన అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచి కేకేఆర్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. 10 మ్యాచ్‌ల్లో 6 ఓటములతో ప్లేఆఫ్స్ కు చేరడం వారికి ఇప్పుడు గగనంగా మారింది. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తన బౌలర్ల వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.




