CWG 2026: భారత్‌కు తొలి పతకం.. ఝండూ కుమార్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు!
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్‌కు పారా అథ్లెట్ ఝండూ కుమార్ తొలి కాంస్య పతకం అందించారు.
CWG 2026: భారత్‌కు తొలి పతకం.. ఝండూ కుమార్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు!
CWG 2026: స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026 (Commonwealth Games 2026)లో భారత్ పతకాల బోణీ కొట్టింది. హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ విభాగంలో భారత అథ్లెట్ ఝండూ కుమార్ (Jhandu Kumar) కాంస్య పతకం సాధించి దేశానికి తొలి మెడల్ అందించారు.
శుక్రవారం రాత్రి జరిగిన హెవీవెయిట్ ఫైనల్లో ఝండూ కుమార్ 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి, మొత్తం 130.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు
గ్లాస్గో వేదికగా దేశ పతాకాన్ని రెపరెపలాడించిన ఝండూ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ..."కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్‌కు తొలి పతకం అందించిన పారా అథ్లెట్ ఝండూ కుమార్‌కు నా హృదయపూర్వక అభినందనలు. హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్యం గెలిచి యావత్ దేశం గర్వించేలా చేశారు. ఆయన విజయం అపారమైన శక్తికి, సంకల్పానికి నిదర్శనం. ఎన్నో ఏళ్ల కఠిన సాధన, ప్రతి సవాల్‌ను ధీటుగా ఎదుర్కొన్న తీరు అంతర్జాతీయ వేదికపై ప్రతిఫలించింది. ఆయన విజయం ఎంతోమంది భారతీయ యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది" అని కొనియాడారు.
సవాళ్లను అధిగమించి సాధించిన విజయం!
బీహార్‌లోని నలందా జిల్లాకు చెందిన ఝండూ కుమార్ చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డారు. ఎన్నో ఆర్థిక, శారీరక కష్టాలను ఎదుర్కొని క్రీడారంగంలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో షాట్‌పుట్, డిస్కస్ త్రో విభాగాలు ఆడిన ఆయన, అనంతరం పారా పవర్‌లిఫ్టింగ్ వైపు మళ్లారు. జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించిన ఝండూ కుమార్, ఇప్పుడు ఏకంగా కామన్వెల్త్ వేదికపై భారత్‌కు తొలి పతకాన్ని అందించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.




