CSK vs MI: ముంబైపై చెన్నై ఘన విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఆశలు సజీవం, ఇంటికి ఎంఐ!

CSK beat MI in IPL 2026. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది.

Rishvik
Published on: 2 May 2026 11:52 PM IST
CSK vs MI
X

CSK vs MI: ముంబైపై చెన్నై ఘన విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఆశలు సజీవం, ఇంటికి ఎంఐ!

CSK beat MI in IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం చెపాక్ మైదానంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఘన విజయం సాధించింది. ముంబై నిర్ధేశించిన 160 పరుగుల టార్గెట్‌ని చెన్నై 18.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. సీఎస్కే విజయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67), ఇంపాక్ట్ ప్లేయర్ కార్తిక్ శర్మ (54) కీలక పాత్రలు పోషించారు. ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించి చెన్నైకి కీలక విజయాన్ని అందించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, ఘజన్‌ఫర్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో సీఎస్కే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండగా.. ఇక ఎంఐ ఇంటిదారి పట్టనుంది.

160 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. రెండు బౌండరీలు బాది ఊపుమీదున్న సంజు శాంసన్ (11)ను జస్ప్రీత్ బుమ్రా రెండో ఓవర్‌లో అవుట్ చేశాడు. ఉర్విల్ పటేల్ (24) అండతో రుతురాజ్ చెలరేగాడు. ఉర్విల్ ధాటిగా ఆడే క్రమంలో ఘజన్‌ఫర్ వేసిన 5.4 ఓవర్‌కు పెవిలియన్ చేరాడు. దాంతో చెన్నై కష్టాల్లో పడింది. ఇంపాక్ట్ ఆటగాడిగా కార్తిక్ శర్మ క్రీజులోకి వచ్చాడు. రుతురాజ్, కార్తిక్ కలిసి మరో వికెట్ పడకుండా పరుగులు చేశారు. దాంతో 10 ఓవర్లకు చెన్నై స్కోరు 92/2గా ఉంది. 14 ఓవర్‌లో రుతురాజ్, 18వ ఓవర్‌లో కార్తీక్ హాఫ్ హాఫ్ సెంచరీలు బాది.. చెన్నైకి సునాయాస విజయాన్ని అందించారు.

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధీర్ (57), ర్యాన్ రికెల్టన్ (37), సూర్యకుమార్ యాదవ్ (21), హార్దిక్ పాండ్య (18) పరుగులు చేశారు. విల్ జాక్స్ (1), తిలక్ వర్మ (5) విఫలమయ్యారు. హార్దిక్ పాండ్య నెమ్మదిగా ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టలేదు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 3, నూర్ అహ్మద్ 2 వికెట్స్ తీయగా.. రామకృష్ణ ఘోష్, జేమీ ఒవర్టన్ చెరో వికెట్ తీశారు. తొమ్మిది మ్యాచ్‌లలో చెన్నైకి ఇది నాలుగో విజయం. తొమ్మిది మ్యాచ్‌లలో ఏడో ఓటమిని చవిచూసిన ముంబై.. మిగతా ఐదు మ్యాచులలో గెలిచినా ప్లేఆఫ్స్‌ చేరడం కష్టమే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story