Commonwealth Games : కామన్వెల్త్ గేమ్స్‌ సమరం.. టాప్-5 టార్గెట్‌తో బరిలోకి భారత్.!

Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల మహాయజ్ఞానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. గురువారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌లో తమ

G Krishna
Published on: 23 July 2026 11:54 AM IST
commonwealth games
X

commonwealth games

Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల మహాయజ్ఞానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌లో తమ సత్తా చాటేందుకు భారత క్రీడా బృందం సర్వం సిద్ధం చేసుకుంది. అయితే.. గత రెండు దశాబ్దాలుగా టాప్-5 స్థానంలో కొలువుదీరుతున్న భారత్, ఈసారి కూడా అదే విజయ పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ఈ సారి ప్రధానంగా బాక్సింగ్, అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాలపైనే భారత్ కొండంత ఆశలు పెట్టుకుంది భారత్.

భారత్‌కు మింగుడుపడని ఈవెంట్ల తొలగింపు

ఈ సారి కామన్వెల్త్ క్రీడల్లో ఈవెంట్ల సంఖ్యను నిర్వాహకులు భారీగా తగ్గించడం భారత్‌కు పెద్ద సవాలుగా మారింది. మన దేశానికి అత్యధికంగా పతకాలు అందించే రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షూటింగ్ విభాగాలను ఈసారి పోటీల నుంచి ఊహించని విధంగా తొలగించారు. గతేడాది బర్మింగ్‌హామ్ ఎడిషన్‌లో భారత్ సాధించిన 61 పతకాల్లో ఏకంగా 25 పతకాలు ఈ నాలుగు క్రీడల నుంచే రావడం గమనార్హం. వీటిని తొలగించడంతో టాప్-5 ర్యాంక్‌ను నిలబెట్టుకోవడం మన అథ్లెట్లకు కాస్త క్లిష్టమైన విషయమే.

అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా నేతృత్వంలో సైన్యం సిద్ధం ..

అథ్లెటిక్స్ విభాగంలో ఏకంగా 32 మందితో కూడిన అతిపెద్ద బృందం భారత పతకాల ఆశలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. అయితే పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్, శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగల నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్, హైజంపర్ సర్వేశ్ కుషారే, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ , 4X400 మీటర్ల రిలే (పురుషులు, మహిళలు) జట్లపై భారీ అంచనాలు ఉన్నాయి.

హ్యాట్రిక్‌పై మీరాబాయి కన్ను.. రింగ్‌లోకి దిగ్గజ బాక్సర్లు

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను హ్యాట్రిక్ స్వర్ణం సాధించడమే లక్ష్యంగా రింగ్ లోకి అడుగుపెడుతోంది. ఈ విభాగంలో మొత్తం 11 మంది భారత లిఫ్టర్లు పోటీపడుతున్నారు. మరోవైపు బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీ), జైస్మిన్ లంబోరియా (57 కేజీ), ప్రీతి పవార్ (54 కేజీ), సాక్షి చౌదరి (51 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ)లతో పాటు పురుషుల విభాగంలో నరేందర్ బెర్వాల్ (+90 కేజీ), సచిన్ సివాచ్ (60 కేజీ) పతకమే ధ్యేయంగా పోరాటానికి సిద్ధమయ్యారు.

గ్లాస్గో వేదికగా మెగా టోర్నీ ...

ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ నుంచి మొత్తం 125 మంది అథ్లెట్లు 10 వేర్వేరు క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల నుంచి దాదాపు 3,000 మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. ప్రధాన పోటీలతో పాటు పారా ఈవెంట్లను కూడా ఒకేసారి నిర్వహించనున్నారు. కాగా, ఆర్థిక భారం కారణంగా 2023లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా ఆతిథ్య హక్కుల నుంచి తప్పుకోవడంతో, స్కాట్లాండ్‌లోని గ్లాస్గో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story