Bhuvaneshwar Kumar : బుమ్రా రికార్డు బద్ధలు.. మలింగ రికార్డు సమం..స్వింగ్ సుల్తాన్ భీభత్సం

Bhuvaneshwar Kumar : ఐపీఎల్ 2026లో భువనేశ్వర్ కుమార్ సంచలన ప్రదర్శన ఇచ్చారు. ముంబైపై 4 వికెట్లు తీసి బుమ్రా రికార్డును సమం చేయడమే కాకుండా పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

CR Reddy
Published on: 11 May 2026 6:14 AM IST
Bhuvaneshwar Kumar
X

Bhuvaneshwar Kumar

Bhuvaneshwar Kumar : ఐపీఎల్ 2026లో ఓ వైపు కుర్రాళ్లు కుమ్మేస్తున్నా, తనేం తక్కువ కాదంటూ తన స్వింగ్‌తో మాయ చేస్తున్నాడు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న భువీ.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బంతులతో ముంబై టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ఈ సీజన్‌లో మొదటిసారి 4 వికెట్ల ప్రదర్శన చేయడమే కాకుండా, పర్పుల్ క్యాప్ రేసులో అందరికంటే ముందుకు దూసుకెళ్లాడు.

తొలి స్పెల్‌లోనే ముంబై ఖేల్‌ ఖతం

రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ తన పాత రోజులను గుర్తు చేశాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రయాన్ రికెల్టన్‌ను పెవిలియన్ పంపిన భువీ.. తన రెండో ఓవర్లో అసలైన విధ్వంసం సృష్టించాడు. వరుస బంతుల్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌లను అవుట్ చేసి ముంబైని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆఖరి ఓవర్లో హాఫ్ సెంచరీతో ప్రమాదకరంగా మారిన తిలక్ వర్మను కూడా అవుట్ చేసి తన కోటాను 4 వికెట్లతో ముగించాడు. 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై నడ్డి విరిచాడు.

పర్పుల్ క్యాప్ రేసులో నెంబర్-1

ఈ అద్భుత ప్రదర్శనతో భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2026లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు భువీ ఖాతాలో 17 వికెట్లు ఉండగా.. ఇప్పుడు అవి 21కి చేరాయి. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న అన్షుల్ కాంబోజ్ (19), కగిసో రబడ (18)లను వెనక్కి నెట్టి పర్పుల్ క్యాప్ తన వద్దే ఉంటుందని భువీ నిరూపించుకున్నాడు. 36 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్‌నెస్‌తో, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను భయపెడుతున్నాడు.

బుమ్రా, మలింగ రికార్డులు సమం

వికెట్ల పరంగానే కాకుండా ఒక అరుదైన మైలురాయిని కూడా భువనేశ్వర్ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేర్వేరు సీజన్లలో 20 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ సరసన భువీ చేరిపోయాడు. ప్రస్తుతం వీరి కంటే ముందు లెజెండరీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (5 సార్లు) మాత్రమే ఉన్నాడు. భువీ ఫామ్ చూస్తుంటే ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి కప్పు అందించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నట్లు కనిపిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story