ఏ ఆటగాడిపై వివక్ష ఉండదు.. టాలెంట్ ఉంటేనే ఛాన్స్.. విమర్శకులకు ఇచ్చిపడేసిన బీసీసీఐ!

BCCI React on Vaibhav Sooryavanshi Debut Criticism. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నేపథ్యంలో విమర్శలపై బీసీసీఐ తాజాగా స్పందించింది.

Rishvik
Published on: 6 July 2026 6:40 PM IST
BCCI
X

ఏ ఆటగాడిపై వివక్ష ఉండదు.. టాలెంట్ ఉంటేనే ఛాన్స్.. విమర్శకులకు ఇచ్చిపడేసిన బీసీసీఐ!

ఏ ఆటగాడిపై వివక్ష ఉండదు.. టాలెంట్ ఉంటేనే ఛాన్స్.. విమర్శకులకు ఇచ్చిపడేసిన బీసీసీఐ !

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో కాస్త లేటుగా అరంగేట్రం చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా స్పందించింది. వైభవ్‌కు అవకాశం ఇవ్వడంలో ఎలాంటి అన్యాయం జరగలేదని, ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు సరైన సమయంలోనే అవకాశం లభిస్తుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై వచ్చిన విమర్శలు సరికావని పేర్కొన్నారు. ఏ ఆటగాడిపై బీసీసీఐ వివక్ష చూపదని, టాలెంట్ ఉంటేనే ఛాన్స్ అవస్తుందని.. అందుకు సమయం పడుతుందని రాజీవ్ శుక్లా విమర్శలకు గట్టిగా ఇచ్చిపడేశారు.

ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ భారత జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. 15 సంవత్సరాల 99 రోజుల వయసులో భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా బుడ్డోడు చరిత్ర సృష్టించాడు. అలాగే టెస్టు హోదా కలిగిన దేశాల తరఫున టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగానూ కొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే వైభవ్‌కు కాస్త ఆలస్యంగా అవకాశం ఇస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని రాజీవ్ శుక్లా తెలిపారు. అయితే బీసీసీఐ ఎప్పుడూ ఎవరిపట్లా వివక్ష చూపదని, అర్హత ఉన్న ప్రతి ఆటగాడికి సరైన సమయంలో అవకాశం కల్పిస్తుందని స్పష్టం చేశారు.

'వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. అతడికి ఈ అవకాశం రావడం సంతోషంగా ఉంది. బీసీసీఐలో ఎవరికీ అన్యాయం జరగదు. అర్హత ఉన్న ఆటగాడికి తప్పకుండా అవకాశం లభిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం లేదంటూ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లపై విమర్శలు వచ్చాయి. కానీ అస్సలు సరికావు. సరైన సమయం వచ్చినప్పుడు అతడికి అవకాశం వస్తుందని నేను ముందే చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. భవిష్యత్తులో వైభవ్ అద్భుతంగా రాణించి భారత జట్టులో స్థిరపడతాడనే నమ్మకం మాకు ఉంది. అతడిని ఎంపిక చేసిన టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని అభినందించాలి' అని రాజీవ్ శుక్లా అన్నారు.

అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 10 బంతుల్లో రెండు భారీ సిక్సర్లతో 14 పరుగులు బాదాడు. అయితే విల్ జాక్స్ బౌలింగ్‌లో స్టంపౌట్ కావడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. అయినప్పటికీ అతని ఆత్మవిశ్వాసం అభిమానులను ఆకట్టుకుంది. ఈ అరంగేట్రంతో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న పలు రికార్డులను వైభవ్ బద్దలు కొట్టాడు. సచిన్ 16 సంవత్సరాల 205 రోజుల వయసులో టెస్టుల్లో, 16 సంవత్సరాల 238 రోజుల వయసులో వన్డేల్లో అరంగేట్రం చేయగా.. పీయూష్ చావ్లా 17 సంవత్సరాల 75 రోజుల వయసులో టెస్టుల్లో తొలి మ్యాచ్ ఆడాడు. ఈ ఇద్దరి కంటే తక్కువ వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన భారత ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు.

ఇక రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 24 బంతుల్లో 43 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో 37 పరుగులు చేసి రాణించారు. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 49 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ వర్మ చివర్లో 11 బంతుల్లో అజేయంగా 24 పరుగులు చేసి జట్టు స్కోరును 190కి చేర్చాడు. ఇంగ్లండ్ తరఫున శామ్ కరన్ మూడు వికెట్లు పడగొట్టాడు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. అయితే కెప్టెన్ హ్యారీ బ్రూక్ 15 బంతుల్లో 39 పరుగులు చేయగా.. జాకబ్ బెతెల్ 46 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా ఇంగ్లండ్ వైపు తిప్పేశాడు. టామ్ బాంటన్ 39 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. ఇప్పుడు మిగిలిన మూడు మ్యాచ్‌లు భారత్‌కు అత్యంత కీలకంగా మారాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story