BCCI Pension Scheme: బీసీసీఐ పెన్షన్ స్కీమ్ ఎలా ఉంటుంది?.. ఎవరికెంత వస్తుంది.. ఎప్పుడు ఆగుతుంది?
BCCI Pension Scheme: Know how the BCCI Pension Scheme works. టీమిండియా మాజీ క్రికెటర్ల సంక్షేమానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
BCCI Pension Scheme: బీసీసీఐ పెన్షన్ స్కీమ్ ఎలా ఉంటుంది?.. ఎవరికెంత వస్తుంది.. ఎప్పుడు ఆగుతుంది?
BCCI Pension Scheme: టీమిండియా మాజీ క్రికెటర్ల సంక్షేమానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యమైంది.. బీసీసీఐ పెన్షన్ స్కీమ్. రెండు దశాబ్దాలకు పైగా అమలు చేస్తున్న ప్రత్యేక పథకం ఇటీవల టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో మరోసారి చర్చనీయాంశమైంది. భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడిన రహానే.. స్కీమ్‌లో అత్యధిక పెన్షన్ పొందే విభాగానికి అర్హుడు. జింక్స్ నెలకు రూ.70,000 పెన్షన్ రూపంలో పొందనున్నాడు.
2004లో ప్రారంభమైన పెన్షన్ పథకం:
బీసీసీఐ 2004 ఏప్రిల్‌లో మాజీ క్రికెటర్లు, అధికారుల కోసం ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. తొలి దశలో 174 మంది మాజీ ఆటగాళ్లు, అధికారులకు నెలకు రూ.5,000 చొప్పున పెన్షన్ అందజేసింది. అప్పట్లో కనీసం ఒక టెస్టు మ్యాచ్ ఆడిన వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉండేవారు.
2022లో భారీగా పెరిగిన పెన్షన్:
2022 జూన్‌లో బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా పెన్షన్ మొత్తంను గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించారు. మాజీ క్రికెటర్లు, అంపైర్ల సంక్షేమం బీసీసీఐకి అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ.. సుమారు 900 మందికి లబ్ధి చేకూరిందని వెల్లడించారు. లబ్ధిదారుల్లో 75 శాతం మందికి 100 శాతం వరకు పెన్షన్ పెంపు లభించింది.
ప్రస్తుతం ఎవరికెంత పెన్షన్?:
ప్రస్తుతం అమల్లో ఉన్న బీసీసీఐ పెన్షన్ ఇలా ఉంది. 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన మాజీ పురుష క్రికెటర్లు నెలకు రూ.70,000 పొందుతారు. 25 కంటే తక్కువ టెస్టులు ఆడిన మాజీ టెస్టు క్రికెటర్లు నెలకు రూ.60,000.. మాజీ మహిళా అంతర్జాతీయ క్రికెటర్లు నెలకు రూ.52,500 పెన్షన్ అందుకుంటారు. 2003కు ముందు రిటైరైన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లు నెలకు రూ.45,000.. ఇతర మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లు నెలకు రూ.30,000 పొందనున్నారు.
పెన్షన్ జీవితాంతం కొనసాగుతుందా?:
బీసీసీఐ పెన్షన్ క్రికెటర్ల జీవితాంతం కొనసాగుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఉదాహరణకు.. రిటైర్డ్ ఆటగాడు లేదా అధికారి బీసీసీఐ లేదా రాష్ట్ర క్రికెట్ సంఘంలో జీతభత్యాలతో కూడిన అధికారిక పదవిని చేపడితే (జాతీయ జట్టు కోచ్, సెలెక్టర్ లేదా అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తే) ఆ కాలంలో పెన్షన్ రాదు. ఆ బాధ్యతలు ముగిసిన తర్వాత మళ్లీ పెన్షన్ పునరుద్ధరించబడుతుంది.
మాజీ క్రికెటర్లకు భరోసాగా బీసీసీఐ:
ప్రపంచ క్రికెట్లో మాజీ ఆటగాళ్లకు నెలవారీ పెన్షన్ అందించే బోర్డులు చాలా అరుదు. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకం మాజీ క్రికెటర్లకు ఆర్థిక భద్రత కల్పించడమే కాకుండా.. భారత క్రికెట్‌కు వారు చేసిన సేవలకు గుర్తింపుగా నిలుస్తోంది. అజింక్య రహానే రిటైర్మెంట్తో ఈ పథకం మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించింది.




