BCCI: విమర్శలు చేయొద్దు.. ముందు అసలు విషయం తెలుసుకోండి.. విమర్శకులకు బీసీసీఐ కౌంటర్!

BCCI Explains Sanju Samson's Zimbabwe T20 Omission. సంజు శాంసన్‌ను భారత జట్టు నుంచి తప్పించడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Rishvik
Updated on: 7 July 2026 8:15 PM IST
BCCI
X

BCCI: విమర్శలు చేయొద్దు.. ముందు అసలు విషయం తెలుసుకోండి.. విమర్శకులకు బీసీసీఐ కౌంటర్!

BCCI: టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేయలేదు. అతడి స్థానాల్లో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు ఛాన్స్ దక్కింది. సంజును జట్టు నుంచి తప్పించడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన అతడిని పక్కన పెట్టడంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు బీసీసీఐ వర్గాలు తాజాగా సమాధానం ఇచ్చాయి. సంజును పక్కన పెట్టడం వెనుక స్పష్టమైన వ్యూహమే ఉందని వెల్లడించాయి.

ముందు అసలు విషయం తెలుసుకోండి:

జింబాబ్వే పర్యటనను పూర్తిగా యువ ఆటగాళ్లను పరీక్షించే సిరీస్‌గా సెలెక్టర్లు భావించారని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే సీనియర్ ఆటగాడు సంజు శాంసన్‌కు సెప్టెంబర్‌లో జపాన్ వేదికగా జరిగే 2026 ఆసియా క్రీడల జట్టులో చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటనలో మరో వికెట్‌కీపర్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 'సంజు ఇప్పటికే ఆసియా క్రీడల జట్టులో ఉన్నాడు. అతను ఆడే అవకాశం లేని సిరీస్‌కు ఎందుకు తీసుకెళ్లాలి?. సెలక్షన్ కమిటీని విమర్శించే ముందు కొంత హోంవర్క్ చేయాలి' అని ఆ అధికారి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ప్రభ్‌సిమ్రన్‌కు తొలి అవకాశం:

సంజు స్థానంలో యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు జట్టులో అవకాశం లభించింది. గత రెండు ఐపీఎల్ సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున నిలకడగా రాణించిన ప్రభ్‌సిమ్రన్.. ఇటీవల ఇండియా-ఏ జట్టుకు ఆడి ఆకట్టుకున్నాడు. జింబాబ్వే సిరీస్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి అతడు వికెట్‌కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. యువ ఆటగాళ్లను పరీక్షించే క్రమంలోనే అతడికి ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

వైభవ్ ఎంట్రీతో సంజుకు ఎదురుదెబ్బ:

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో సంజు శాంసన్ స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చారు. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో వరుసగా విఫలమైన సంజు.. జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. మరోవైపు వైభవ్ తన తొలి మ్యాచ్‌లో దూకుడైన ఆటతో ఆకట్టుకోవడంతో సెలెక్టర్లు అతడిపై దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

మరికొందరు సీనియర్లకూ విశ్రాంతి:

సంజు శాంసన్‌తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌లకు కూడా జింబాబ్వే సిరీస్‌కు చోటు దక్కలేదు. వీరిలో కొందరు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగం కానుండగా.. మరికొందరికి విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు రింకూ సింగ్, మయాంక్ యాదవ్ మళ్లీ భారత జట్టులోకి తిరిగి వచ్చారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు జులై 23, 25, 27 తేదీల్లో హరారే వేదికగా జింబాబ్వేతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.



Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story