Jay Shah: 40 ఎకరాల బీడు భూమి టు అత్యాధునిక క్రికెట్ సెంటర్.. జై షా విజన్‌ సూపర్!

Know Jay Shah's key role in BCCI Centre of Excellence project. ఐసీసీ చైర్మన్ జై షా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.

Rishvik
Published on: 10 Aug 2026 6:50 PM IST
Jay Shah
X

Jay Shah: 40 ఎకరాల బీడు భూమి టు అత్యాధునిక క్రికెట్ సెంటర్.. జై షా విజన్‌ సూపర్!

Jay Shah: భారత క్రికెట్‌లో ఆటగాళ్లకు ప్రపంచస్థాయి శిక్షణ, ఫిట్‌నెస్, రిహాబిలిటేషన్ సదుపాయాలను అందించాలనే లక్ష్యంతో బీసీసీఐ ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ప్రస్తుతం అత్యాధునిక క్రికెట్ సదుపాయంగా నిలిచింది. అయితే సీఓఈ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో సవాళ్లు, అనేక మంది కృషి ఉన్నాయి. ముఖ్యంగా మాజీ బీసీసీఐ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ జై షా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.

బెంగళూరులోని సుమారు 40 ఎకరాల భూమి ఒకప్పుడు నిరుపయోగంగా ఉండేది. ఆ స్థలంలో అత్యాధునిక క్రికెట్ కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడం అంత సులభం కాలేదు. భూమికి సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలు, రెగ్యులరైజేషన్ వంటి అనేక సమస్యలను పరిష్కరించాల్సి వచ్చింది. చివరకు 2022 ఫిబ్రవరి 14న నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జై షా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులందరినీ ఒప్పించారని దేవజిత్ సైకియా తెలిపారు. పాత నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) తాత్కాలిక సదుపాయాల నుంచి బయటకు వచ్చి.. పూర్తిస్థాయి క్రికెట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని జై షా గుర్తించారని చెప్పారు. భూమికి సంబంధించిన చట్టపరమైన అడ్డంకులను తొలగించేందుకు జై షా స్వయంగా పలుమార్లు అక్కడికి వెళ్లారని సైకియా వివరించారు.

'40 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయడం ఈ ప్రాజెక్టులో అతిపెద్ద సవాలు. ఆ భూమి చాలా కాలంగా ఖాళీగా ఉండటంతో తిరిగి తీసుకోవాలని కొందరు ప్రయత్నాలు చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించే ముందు అన్ని సమస్యలను పరిష్కరించాల్సి వచ్చింది. ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ఒకే లక్ష్యంపైకి తీసుకురావడంలో జై షా కీలకంగా వ్యవహరించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మారే ప్రక్రియలో మాజీ భారత క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా కీలక పాత్ర పోషించారు. రాహుల్ ద్రవిడ్ భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఎన్‌సీఏలో కార్యకలాపాలకు కొనసాగింపు ఉండేలా లక్ష్మణ్‌ను బెంగళూరుకు తీసుకురావడంలో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా చొరవ చూపారు' అని సైకియా చెప్పుకొచ్చాడు

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణంలో జై షా చూపిన వ్యక్తిగత ఆసక్తిని లక్ష్మణ్ కూడా గతంలో గుర్తుచేశారు. ఆర్కిటెక్ట్‌లు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో జరిగిన సమావేశాలకు జై షా స్వయంగా హాజరై.. ప్రాజెక్టులోని ప్రతి అంశాన్ని పరిశీలించేవారని తెలిపారు. ఆటగాళ్లకు అవసరమైన ప్రతి సదుపాయం అందుబాటులో ఉండేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. దాదాపు రెండేళ్ల వ్యవధిలోనే మొత్తం మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఒకప్పుడు ఖాళీగా ఉన్న 40 ఎకరాల భూమి.. ఇప్పుడు భారత క్రికెటర్లకు శిక్షణ, ఫిట్‌నెస్, రిహాబిలిటేషన్, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగపడే అత్యాధునిక కేంద్రంగా మారింది.

బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 2024 నవంబర్‌లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. నేషనల్ క్రికెట్ అకాడమీకి ఆధునిక రూపంగా ఏర్పడిన ఈ కేంద్రం.. భారత క్రికెటర్లతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఆటగాళ్ల అభివృద్ధికి కీలక వేదికగా మారింది. ఈ ప్రాజెక్టు వెనుక జై షా చూపిన పట్టుదల, బీసీసీఐ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు, వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు అధికారుల కృషి ఉన్నాయని సైకియా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. 40 ఎకరాల బీడు భూమి నుంచి ప్రపంచస్థాయి క్రికెట్ సదుపాయంగా మారిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.. భారత క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story