CSK Captain: రుతురాజ్ గైక్వాడ్‌ వద్దు, సంజునే ముద్దు.. మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు!

CSK Captain: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నిరాశాజనక ప్రదర్శన చేసింది.

Rishvik
Published on: 23 May 2026 6:26 PM IST
CSK Captain
X

CSK Captain: రుతురాజ్ గైక్వాడ్‌ వద్దు, సంజునే ముద్దు.. మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు!

CSK Captain: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నిరాశాజనక ప్రదర్శన చేసింది. వరుస ఓటములతో మూల్యం చెల్లించుకుని.. ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే ఈసారి అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. అంతేకాకుండా సీజన్ ప్రారంభం నుంచే గాయాల సమస్యలు జట్టును వెంటాడాయి. 14 మ్యాచ్‌ల్లో కేవలం 12 పాయింట్లతో లీగ్ దశను ముగించింది.

సీజన్ ఆరంభంలో వరుసగా మూడు ఓటములు చవిచూసిన సీఎస్‌కే.. మధ్యలో కొన్ని విజయాలతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. అయితే కీలక సమయంలో మరలా పరాజయాలను ఎదుర్కొంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్, సీఎస్‌కే మాజీ ఆటగాడు సుబ్రమణియం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన బద్రీనాథ్.. వచ్చే సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ సీఎస్‌కే కెప్టెన్‌గా కొనసాగకూడదని చెన్నైకి సూచించాడు. 'రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలి. అతని బ్యాటింగ్ సీఎస్‌కేకు చాలా కీలకం. కెప్టెన్సీ కంటే అతడు బ్యాటర్‌గా జట్టుకు ఎక్కువ ఉపయోగపడతాడు. నాయకత్వ బాధ్యతలు లేకపోతే రుతురాజ్ మరింత స్వేచ్ఛగా ఆడగలడు' అని పేర్కొన్నాడు.

అంతేకాకుండా సంజు శాంసన్ సీఎస్‌కేకు కెప్టెన్‌గా సరైన ఎంపిక అని ఎస్ బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. 'సంజూ శాంసన్ మంచి కెప్టెన్. రుతురాజ్ అద్భుతమైన టీ20 బ్యాటర్. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం కఠిన నిర్ణయం కాదు. అది ఆటగాడికీ, ఫ్రాంచైజీకీ ప్రయోజనకరమే. కెప్టెన్సీ బాధ్యతలు బ్యాటింగ్‌పై ప్రభావం చూపడం కొత్త విషయం కాదు. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలకూ కెప్టెన్సీ ఒత్తిడి ప్రభావం చూపింది. ప్రతి ఆటగాడు బ్యాటింగ్, కెప్టెన్సీ మధ్య సమతౌల్యం సాధించలేడు. ఎంఎస్ ధోనీ మాత్రం మొదటి నుంచే ఆ స్పష్టత ఇఉన్న ఆటగాడు. అలాగే రోహిత్ శర్మ కూడా సహజ నాయకుడు' అని వ్యాఖ్యానించాడు.

అలాగే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆర్‌సీబీ కెప్టెన్ కాకపోయినా.. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడని ఎస్ బద్రీనాథ్ గుర్తు చేశాడు. 'ఇప్పుడు ఆర్‌సీబీకి రజత్ పాటిదార్ అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ మాత్రం బ్యాటర్‌గా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి కెప్టెన్సీ మార్పు కొన్నిసార్లు ఆటగాడి కెరీర్‌కు ఎంతో మేలు చేస్తుంది, సంజు ఇప్పటికే నిరూపించుకున్నాడు. చెన్నై సారథ్యం అతడికి ఇస్తే బాగుటుంది' అని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story