LSG vs RR : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కామెడీ రనౌట్..!

LSG vs RR : ఐపీఎల్‌లో లక్నో బౌలర్ మొహసిన్ ఖాన్ చేసిన ఘోర రనౌట్ తప్పిదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Naresh.k
Published on: 20 May 2026 9:21 AM IST
LSG vs RR
X

LSG vs RR : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కామెడీ రనౌట్..!

Vaibhav Suryavanshi: మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జాయింట్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతా లక్నో విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ, 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కేవలం 15 ఏళ్ల వయసున్న రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లక్నో బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు.

ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి కేవలం 38 బంతుల్లో 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి లక్నోకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ మధ్యలోనే అసలైన హైలైట్ సీన్ జరిగింది.

ఏంటయ్యా మొహసిన్ ఇది

రాజస్థాన్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ మొదటి బంతికి స్టేడియంలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ధ్రువ్ జురెల్ ఆడిన షాట్‌ను లక్నో ఫీల్డర్ దిగ్వేష్ అద్భుతంగా ఆపి, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బౌలర్ మొహసిన్ ఖాన్‌కు బంతిని విసిరాడు. అప్పటికే క్రీజు వదిలి సగం దూరం వచ్చేసిన వైభవ్ సూర్యవంశీ, వెనక్కి వెళ్లే అవకాశం లేక అవుట్ అయిపోయానని ఫిక్స్ అయిపోయి ఆశలు వదిలేసుకున్నాడు.

మొహసిన్ ఖాన్ వికెట్ల ముందే నిలబడి ఉన్నాడు, చేతిలో బంతి ఉంది. కేవలం వికెట్లను తాకిస్తే చాలు.. రనౌట్. కానీ అక్కడే మొహసిన్‌కు ఏం గుర్తొచ్చిందో ఏమో.. వికెట్లను నేరుగా తాకించకుండా, పక్కనే ఉండి బంతిని వికెట్లపైకి గాల్లోకి విసిరాడు. ఆశ్చర్యకరంగా ఆ బంతి వికెట్లకు తగలకుండా పక్కనుంచి వెళ్ళిపోయింది. దాంతో వైభవ్ నవ్వుకుంటూ చాలా ఈజీగా క్రీజులోకి చేరుకున్నాడు. ఈ ఘోర తప్పిదం గతంలో 2009లో డెక్కన్ చార్జర్స్‌పై సీఎస్‌కే ప్లేయర్ షాదాబ్ జకాతీ చేసిన రనౌట్ బ్లండర్‌ను గుర్తుచేసింది.

ఈ ఘోరమైన రనౌట్ మిస్ అయినప్పటికీ, మొహసిన్ ఖాన్ ఏమాత్రం సహనం కోల్పోకుండా అదే ఓవర్లో తన తప్పును సరిదిద్దుకున్నాడు. అదే 14వ ఓవర్ ఆఖరి బంతికి (6వ బంతి) ఆఫ్‌స్టంప్ అవతల ఒక పక్కా ప్లానింగ్‌తో స్లోయర్ డెలివరీ వేశాడు మొహసిన్. దానిని భారీ షాట్ ఆడబోయిన వైభవ్ సూర్యవంశీ.. లాంగ్-ఆన్‌లో ఉన్న అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అలా 93 పరుగుల వద్ద వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఈ ఐపీఎల్ సీజన్ లో మొహసిన్ ఖాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 6 ఇన్నింగ్స్‌లలో 11 వికెట్లు తీసి, కోల్‌కతాపై 5 వికెట్ల హాల్ తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మాత్రం మొహసిన్ చేసిన కామెడీ రనౌట్ మిస్ లక్నో కొంపముంచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రనౌట్ మిస్సింగ్ వీడియోపై నెటిజన్లు "ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కామెడీ రనౌట్ అంటూ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story