Dodda Ganesh: ప్రాణం పెట్టి బౌలింగ్ చేశాడు.. బీసీసీఐది ముమ్మాటికీ తప్పే!
Dodda Ganesh: యువ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీ భారత జట్టుకు ఎంపిక కాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
Dodda Ganesh: ప్రాణం పెట్టి బౌలింగ్ చేశాడు.. బీసీసీఐది ముమ్మాటికీ తప్పే!
Dodda Ganesh: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఇటీవల భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. యువ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీ ఎంపిక కాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. అతడిని పట్టించుకోకపోవడంపై మాజీ భారత పేసర్ దొడ్డ గణేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత రెండు దేశవాళీ సీజన్‌లో అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. అకిబ్ నబీ ప్రాణం పెట్టి బౌలింగ్ చేశాడని దొడ్డ గణేష్ చెప్పుకొచ్చాడు.
జమ్మూ కశ్మీర్ తరఫున ఆడుతున్న అకిబ్ నబీ గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో కలిపి 104 వికెట్లు పడగొట్టి సంచలన ప్రదర్శన చేశాడు. అంతేకాకుండా తన జట్టును చారిత్రాత్మక విజయాల దిశగా నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అతని ప్రతిభను గుర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026 వేలంలో రూ.8.4 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే ఇంతటి ప్రదర్శన చేసినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు బీసీసీఐ సెలెక్టర్లు అతడికి అవకాశం ఇవ్వలేదు. బదులుగా పంజాబ్‌కు చెందిన యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌ను బ్యాకప్ బౌలర్‌గా ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని డొడ్డ గణేష్ తీవ్రంగా తప్పుబట్టాడు.
సోషల్ మీడియాలో స్పందించిన డొడ్డ గణేష్.. 'ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు అకిబ్ నబీ ఎంపిక కాకపోవడానికి ఎలాంటి కారణాలు చెప్పినా నేను ఒప్పుకోను. రెండు సీజన్లుగా అతడు ప్రాణం పెట్టి బౌలింగ్ చేశాడు. 100కిపైగా రంజీ వికెట్లు తీసినా అతడిని పక్కన పెట్టి.. ఈ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిని ఎంపిక చేయడం సరైంది కాదు' అని పేర్కొన్నాడు. సెలక్షన్ కమిటీ ఇస్తున్న వివరణలను కూడా తప్పుబట్టాడు. 'హిట్ ది డెక్ బౌలర్, ప్రత్యేక నైపుణ్యం ఉన్న బౌలర్ అంటూ చెబుతున్నారు. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నా సరే.. మ్యాచ్ అనుభవం లేకుండా ఎంపిక చేయడం ఎలా?. వరుసగా అద్భుత ప్రదర్శనలు చేస్తున్న ఆటగాడిని విస్మరించడం యువ క్రికెటర్లకు తప్పుడు సందేశం పంపినట్లే' అని విమర్శించాడు.
ఇక భారత ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం అకిబ్ నబీ ఎంపికపై స్పందించాడు. 'అకిబ్ నబీ ఈ సీజన్ మాత్రమే కాదు, గత సీజన్‌లో కూడా అద్భుతంగా ఆడాడు. అతని ఎంపికపై చర్చ జరిగింది. అయితే భారత పరిస్థితుల్లో సాధారణంగా ఎక్కువ మంది పేసర్లను ఎంపిక చేయము. ప్రస్తుతం మేము ఎంపిక చేసిన ముగ్గురు బౌలర్లపైనే విశ్వాసం ఉంచాం. అయినప్పటికీ నబీ ఆలోచనలో చాలా దగ్గర వరకు వచ్చాడు' అని అగార్కర్ తెలిపాడు. అయితే ఈ వివాదం ఇప్పుడు భారత క్రికెట్‌లో దేశీయ ప్రదర్శనలకు నిజంగా విలువ ఇస్తున్నారా అనే చర్చకు దారితీసింది. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో రాణిస్తున్న యువ ఆటగాళ్లకు ఇది నిరాశ కలిగించే నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.




