Asian Games: ఆ ఏర్పాట్లపై బీసీసీఐ ఫైర్.. స్వ్కాడ్ లో ఊహించని ట్విస్ట్..!

Asian Games: ఏషియన్ గేమ్స్ 2026 కోసం జపాన్‌లో చేసిన ఏర్పాట్లపై BCCI, ACC అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Venkat
Published on: 28 Aug 2026 5:29 PM IST
Asian Games
X

Asian Games: ఆ ఏర్పాట్లపై బీసీసీఐ ఫైర్.. స్వ్కాడ్ లో ఊహించని ట్విస్ట్..!

Asian Games 2026, India T20 Squad: ఏషియన్ గేమ్స్ 2026కు ముందు టీమ్‌ఇండియా విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జపాన్‌లో ఆటగాళ్ల కోసం చేసిన ఏర్పాట్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోతే.. ముందుగా ప్రకటించిన బలమైన జట్టుకు బదులుగా ‘బి’ టీమ్‌ను ఏషియన్ గేమ్స్‌కు పంపే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు సమస్య ఏంటి?

ఏషియన్ గేమ్స్ కోసం జపాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరిగే వేదిక వద్ద ఆటగాళ్లకు కల్పిస్తున్న సౌకర్యాలపై బీసీసీఐకి కొన్ని అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్‌ల ఏర్పాట్లు, వాష్‌రూమ్‌లు, హోటల్ గదుల పరిమాణంపై ఆందోళన వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

అక్కడ డ్రెస్సింగ్ రూమ్‌లను టెంట్లలో ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంతేకాదు.. వాటికి సంబంధించిన వాష్‌రూమ్‌లు సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఆటగాళ్ల సౌకర్యం, భద్రత, మ్యాచ్‌ల సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల విషయంలో ఇవి ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.

హోటల్ గదులపైనా అభ్యంతరాలు..

వసతి విషయంలోనూ బీసీసీఐ సంతృప్తిగా లేదని సమాచారం. ఆటగాళ్లకు కేటాయించిన హోటల్ గదులు చాలా చిన్నగా ఉన్నాయని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై కూడా నిర్వాహకులతో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఏషియన్ గేమ్స్‌కు భారీ సంఖ్యలో క్రీడాకారులు, అధికారులు హాజరుకానుండటంతో జపాన్‌లో వసతి ఏర్పాట్లపై ఇప్పటికే ఒత్తిడి పెరిగింది. సుమారు 17 వేల మంది పాల్గొనేవారి నమోదుతో నిర్వాహకులు కూడా సంఖ్యను తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈసారి సంప్రదాయ అథ్లెట్స్ విలేజ్ కూడా ఉండదు.

పరిశీలకుడిని పంపనున్న బీసీసీఐ..

జపాన్‌లో పరిస్థితులు వాస్తవంగా ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు బీసీసీఐ ఒక పరిశీలకుడిని అక్కడికి పంపనున్నట్లు సమాచారం. వేదిక, డ్రెస్సింగ్ రూమ్‌లు, వాష్‌రూమ్‌లు, హోటల్ వసతి తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అంటే.. ప్రస్తుతం టీమ్‌ఇండియా ‘బి’ టీమ్‌నే పంపుతారని ఖరారు కాలేదు. ఏర్పాట్లు సంతృప్తికరంగా లేకపోతే మాత్రమే ప్రధాన జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రకటించిన జట్టులో స్టార్ ఆటగాళ్లు..

బీసీసీఐ ముందుగా ఏషియన్ గేమ్స్ కోసం బలమైన భారత పురుషుల జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు కూడా జట్టులో ఉన్నారు. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.

భారత్ పురుషుల జట్టు..

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా.

సీనియర్లకు బదులుగా యువ ఆటగాళ్లకు అవకాశం?

జపాన్‌లోని ఏర్పాట్లు మెరుగుపడకపోతే.. స్టార్ ఆటగాళ్లను అక్కడికి పంపకుండా యువ, రిజర్వ్ ఆటగాళ్లతో కూడిన జట్టును పంపే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలించవచ్చు. అలాంటి నిర్ణయం తీసుకుంటే దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న పలువురు యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి వేదికపై అవకాశం లభించే అవకాశం ఉంటుంది.

తుది నిర్ణయం ఎప్పుడు?

ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి-నగోయా ప్రాంతంలో జరగనున్నాయి. పురుషుల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు, మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు జరగనుంది.

అయితే టీమ్‌ఇండియా పురుషుల జట్టులో మార్పులు జరుగుతాయా? స్టార్ ఆటగాళ్ల స్థానంలో ‘బి’ టీమ్‌ను పంపుతారా? అన్నది బీసీసీఐ పరిశీలకుడి నివేదిక తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది బీసీసీఐ పరిశీలిస్తున్న ప్రత్యామ్నాయం మాత్రమే.. తుది నిర్ణయం కాదు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story