అదే నా మొదటి లక్ష్యం.. ఈ అవకాశాన్ని వదులుకోను.. ఆసక్తికర విషయాలు చెప్పిన యువ పేసర్!

Ashok Sharma: Ashok Sharma says wearing the Team India jersey is his biggest dream. భారత జట్టు తరఫున ఆడటం ప్రతి క్రికెటర్ కల అని, తాను కూడా ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నానని అశోక్ శర్మ తెలిపాడు.

Rishvik
Published on: 22 July 2026 7:44 PM IST
Ashok Sharma
X

అదే నా మొదటి లక్ష్యం.. ఈ అవకాశాన్ని వదులుకోను.. ఆసక్తికర విషయాలు చెప్పిన యువ పేసర్!

Ashok Sharma: భారత జట్టు తరఫున ఆడటం ప్రతి క్రికెటర్ కల అని, తాను కూడా ఆ క్షణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని యువ ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ తెలిపాడు. జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కడం తనకు జీవితంలో అత్యంత ప్రత్యేకమని చెప్పాడు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానాన్ని స్థిరపరుచుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. మొదటి టీ20 మ్యాచ్‌లో అశోక్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలు అందుబాటులో లేకపోవడంతో అశోక్ ప్లేయింగ్ 11లో ఉండనున్నాడు.

జింబాబ్వే టీ20 సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసి, సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని తాను భావిస్తున్నట్లు అశోక్ శర్మ వెల్లడించాడు. 'భారత్ జెర్సీ ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా మొదటి లక్ష్యం. ఇప్పుడు జట్టులో చోటు దక్కింది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోను. జింబాబ్వే సిరీస్‌లో నా వంతు అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టుకు విజయాలు అందించాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత వీలైనంత త్వరగా భారత టెస్టు జట్టులో స్థానం సంపాదించడమే నా తదుపరి లక్ష్యం' అని అశోక్ చెప్పాడు.

తన క్రికెట్ ప్రయాణంలో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కీలక పాత్ర పోషించారని అశోక్ తెలిపాడు. తనకు ఏ సందేహం వచ్చినా నేరుగా నెహ్రా వద్దకే వెళ్లేవాడినని గుర్తుచేసుకున్నాడు. 'ప్రతి మ్యాచ్ తర్వాత ఆశిష్ నెహ్రా గదికి వెళ్లి నా బౌలింగ్ వీడియోలు చూసేవాడిని. ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఏ అంశాన్ని మెరుగుపరుచుకోవాలో అడిగి తెలుసుకునేవాడిని. ఆయన ఇచ్చిన సూచనలు నా ఆటను మరింత మెరుగుపరిచాయి.

నా ఎదుగుదలకు ఆశిష్ సర్ పాత్ర ఎంతో ఉంది' అని అన్నాడు. 24 ఏళ్ల అశోక్ దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ తరఫున అద్భుత ప్రదర్శన చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అరంగేట్రం చేసిన అతడు.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. రంజీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు.

ప్రపంచ దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ తనకు స్ఫూర్తి అని అశోక్ చెప్పాడు. 'డేల్ స్టెయిన్ ఒక్కడే మ్యాచ్ గెలిపిస్తాడు. తన రోజు అయితే కొన్ని ఓవర్లలోనే మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లో నుంచి లాక్కునేవాడు. అతని దూకుడు, రన్-అప్, వేగం, బ్యాటర్లను బోల్తా కొట్టించే విధానం అన్నీ నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఫాస్ట్ బౌలర్‌గా నేను అతనినే ఆదర్శంగా తీసుకుంటాను. గుజరాత్ టైటాన్స్ శిబిరంలో భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఇచ్చిన సూచనలు నా బౌలింగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మొదటిసారి క్యాంప్‌కు వెళ్లినప్పుడు ఇషాంత్ భయ్యా నా రంజీ ప్రదర్శన గురించి అడిగారు. నాలుగు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశానని చెప్ప. నీ బౌలింగ్ బాగుంది. కానీ గుడ్ లెంగ్త్‌పై మరింత స్థిరంగా బంతులు వేస్తే 16 వికెట్లు 24గా మారతాయని సూచించారు. ఆ మాటలు ఇప్పటికీ గుర్తుంచుకుని ప్రాక్టీస్ చేస్తున్నాను' అని చెప్పాడు.

మహ్మద్ సిరాజ్‌తో నెట్స్‌లో కలిసి సాధన చేయడం తనకు ఎంతో ఉపయోగపడిందని అశోక్ షర్మ తెలిపాడు. 'సిరాజ్ భయ్యా నా బౌలింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించి చిన్న చిన్న మార్పులు సూచించేవారు. రెండు మూడు బంతులు చూసిన వెంటనే ఏం సరిచేయాలో చెప్పేవారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇప్పటికీ జైపూర్‌లో సాధన చేసే సమయంలో ఆయన చెప్పిన విషయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటాను' అని అశోక్ శర్మ పేర్కొన్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story