Anaya Bangar: ట్రాన్స్‌జెండర్‌ అనయ బంగర్‌కు శుభవార్త.. క్రికెట్‌లోకి రీఎంట్రీ.. భారత్ నుంచి కాదండోయ్!

Anaya Bangar: అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన అనయ బంగర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆమెకు అనుమతి ఇచ్చింది.

Rishvik
Published on: 25 Aug 2026 7:12 PM IST
Anaya Bangar
X

Anaya Bangar: ట్రాన్స్‌జెండర్‌ అనయ బంగర్‌కు శుభవార్త.. క్రికెట్‌లోకి రీఎంట్రీ.. భారత్ నుంచి కాదండోయ్!

Anaya Bangar: ట్రాన్స్‌జెండర్‌ క్రికెటర్ అనయ బంగర్‌.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్‌ అన్న విషయం తెలిసిందే. ఆర్యన్ బంగర్‌గా ఉన్న తాను లింగమార్పిడి చేయించుకుని అనయగా మారారు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన అనయ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె మరలా క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆస్ట్రేలియాలో మహిళల కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆమెకు అనుమతి ఇచ్చింది. దీంతో కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న అనయ మరోసారి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. సీఏ అనుమతి ఇవ్వడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

'క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అనుమతి లభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక దశలో నేను ఇకపై క్రికెట్ ఆడలేనేమోనని భావించా. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నాకు మరో అవకాశం కల్పించింది. క్రికెట్‌పై నాకున్న అనుబంధాన్ని కొనసాగించేందుకు ఈ అవకాశం ఎంతో ముఖ్యం. నా టాలెంట్ నిరూపించుకుంటా' అని అనయ బంగర్‌ చెప్పారు. గతంలో ముంబై జూనియర్ క్రికెట్‌లో అనయ (ఆర్యన్ బంగర్‌) ఆడారు. ఆ సమయంలో సర్ఫరాజ్ ఖాన్, అతడి సోదరుడు ముషీర్ ఖాన్‌తో కలిసి వయసుల విభాగాల్లో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ క్రికెట్ ద్వారా తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించనున్నారు.

అయితే మహిళల ఎలైట్ క్రికెట్‌లో ఆడేందుకు మాత్రం కొన్ని అర్హత నిబంధనలను అనయ బంగర్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ ఆస్ట్రేలియా ట్రాన్స్‌జెండర్, జెండర్ డైవర్స్‌ ప్లేయర్లకు సంబంధించిన ఎలైట్ క్రికెట్ పాలసీ ప్రకారం.. నిర్దిష్ట టెస్టోస్టెరాన్ అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఎలైట్ క్రికెట్‌లో పాల్గొనాలంటే సీరమ్ టెస్టోస్టెరాన్ స్థాయి లీటరుకు 10 నానోమోల్స్ కంటే తక్కువగా కనీసం 12 నెలల పాటు ఉండాలి. మహిళల బిగ్ బాష్ లీగ్ వంటి ఎలైట్ క్రికెట్ పోటీల్లో పాల్గొనాలంటే ఈ నిబంధనలు వర్తిస్తాయి. క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ జాకీ పార్ట్రిడ్జ్ అనయకు పంపిన లేఖలో.. 2027 మార్చి నుంచి ఎలైట్ క్రికెట్‌లో ఆడే అర్హతకు సంబంధించి రక్త పరీక్షతో పాటు పాలసీలోని ఇతర నిబంధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం అనయ బంగర్‌కు కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు ఎలాంటి అడ్డంకి లేదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. 2027 మార్చి వరకు ఆస్ట్రేలియాలోని ఏ రాష్ట్రం లేదా టెరిటరీలోనైనా ప్రీమియర్ క్రికెట్ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపింది. ప్రీమియర్ క్రికెట్‌ను ఎలైట్ క్రికెట్‌గా కాకుండా కమ్యూనిటీ క్రికెట్‌గా పరిగణిస్తున్నందున.. ఈ పోటీల్లో ఆమె పాల్గొనడంపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. 2023లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ట్రాన్స్‌జెండర్ ప్లేయర్లకు ఎలైట్ మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడకుండా నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్ల ఎలిజిబిలిటీపై నిబంధనలు చర్చనీయాంశంగా ఉన్నాయి.

ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా ఇచ్చిన అనుమతితో అనయ బంగర్‌ తిరిగి కమ్యూనిటీ క్రికెట్‌లో తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం దక్కించుకుంది. భవిష్యత్తులో ఎలైట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు అవసరమైన అర్హతలను ఆమె పూర్తి చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అనయ తండ్రి సంజయ్ బంగర్‌ టీమిండియాకు ఆడారు. భారత్ తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి కోచ్‌గా పనిచేశారు. సంజయ్‌ బంగర్‌కు ఇద్దరు కుమారులు కాగా.. పెద్దవాడే ఆర్యన్. ఆర్యన్ ఇప్పుడు అనయగా మారాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story