Akshara Gupta : కేవలం 126 బంతుల్లోనే 306 పరుగులు.. భారత మహిళా క్రికెట్‌లో సరికొత్త సంచలనం

Akshara Gupta : బీహార్‌కు చెందిన 14 ఏళ్ల అక్షరా గుప్తా అండర్-19 వన్డే మ్యాచ్‌లో 126 బంతుల్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 306* పరుగులు చేసి సరికొత్త ట్రిపుల్ సెంచరీ రికార్డు సృష్టించింది.

CR Reddy
Updated on: 19 Jun 2026 10:59 AM IST
Akshara Gupta
X

Akshara Gupta

Akshara Gupta : భారత దేశవాళీ క్రికెట్‌లో బీహార్ రాష్ట్రం ఇప్పుడు సరికొత్త రికార్డుల ఫ్యాక్టరీగా మారుతోంది. 15 ఏళ్ల వయసులోనే టీమిండియా స్క్వాడ్‌కు ఎంపికై వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టిస్తుండగా.. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన ఒక మహిళా క్రికెటర్ మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించింది. బీహార్ నుంచి దేశవాళీ క్రికెట్ ఆడుతున్న అక్షరా గుప్తా.. బీసీఏ మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. వన్డే మ్యాచ్ లోనే టీ20ని మించిన వేగంతో ఆడి ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసింది.

లెఫ్ట్ హ్యాండ్ ఆల్ రౌండర్ అయిన అక్షరా గుప్తా.. ప్రత్యర్థి బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడింది. కేవలం 126 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అక్షర.. 306 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఈ నమ్మలేని ఇన్నింగ్స్‌లో ఆమె ఏకంగా 63 బౌండరీలు బాదడం విశేషం. ఇందులో 55 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. అంటే ఆమె చేసిన 306 పరుగులలో ఏకంగా 268 పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రావడం చూస్తే ఆమె ఎంతటి భీకరమైన హిట్టింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ మ్యాచ్‌లో అక్షరా గుప్తా కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కేవలం 34 బంతుల్లోనే సెంచరీ మార్కును దాటేసింది. ఈ అద్భుత ప్రదర్శనతో మహిళల దేశవాళీ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో క్రీడాకారిణిగా అక్షర నిలిచింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ముంబైకి చెందిన ఇరా గుప్తా ఉంది. ఇరా గతంలో 346 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడగా.. ఇప్పుడు 14 ఏళ్ల అక్షర 306 పరుగులతో ఆమె రికార్డుకు చేరువగా వచ్చింది.

అక్షరా గుప్తాను బీహార్ క్రికెట్ లో తదుపరి సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆమె తన అద్భుత ప్రతిభతో వయసుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ టోర్నమెంట్లలో ఆడుతోంది. ఒకే క్రికెట్ సీజన్ లో అండర్-15, అండర్-19, అండర్-23 వంటి మూడు వేర్వేరు ఫార్మాట్లలో ఆడిన బీహార్‌ తొలి క్రికెటర్‌గా అక్షర సరికొత్త రికార్డు సృష్టించింది. ఆమె ఆడే దూకుడు శైలి, వికెట్ల మధ్య పరిగెత్తే నైపుణ్యాలు చూస్తుంటే భవిష్యత్తులో సీనియర్ టీమ్‌కు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానాకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అక్షరా గుప్తా కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరే కావడం, పైగా మంధానా తరహాలోనే ఎంతో అగ్రెసివ్‌గా షాట్లు కొట్టడం ఆమె ప్రత్యేకత. ఇదే ఫామ్‌ను గనుక అక్షర రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తే.. చాలా త్వరగా ఆమె ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ లోను, ఆ తర్వాత నేరుగా టీమిండియాలోను చోటు దక్కించుకోవడం ఖాయం. భవిష్యత్తులో స్మృతి మంధానా, అక్షరా గుప్తా ఇద్దరూ కలిసి భారత జట్టుకు ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story