AFG vs IND: అఫ్గాన్ జట్టులో కీలక మార్పులు.. టీమిండియా బ్యాటర్లను వణికించే బౌలర్లు వచ్చేశారు!

AFG vs IND: భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం జట్టును ప్రకటించింది.

Rishvik
Published on: 24 Aug 2026 7:44 PM IST
AFG vs IND
X

AFG vs IND: అఫ్గాన్ జట్టులో కీలక మార్పులు.. టీమిండియా బ్యాటర్లను వణికించే బౌలర్లు వచ్చేశారు!

AFG vs IND: భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం జట్టును ప్రకటించింది. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కుడి భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్న నవీన్.. టీమిండియాతో కీలక సిరీస్‌కు అందుబాటులోకి రావడం అఫ్గానిస్థాన్ బౌలింగ్ విభాగానికి బలంగా మారింది. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగనుంది. మూడు మ్యాచ్‌లకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ సిరీస్‌తో అఫ్గానిస్థాన్‌కు కొత్త టీ20 కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా మొదటిసారి బాధ్యతలను చేపట్టనున్నాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న జద్రాన్‌కు.. ఇదే తొలి పూర్తి స్థాయి టీ20 సిరీస్. భుజం గాయం కారణంగా నవీన్ ఉల్ హక్ వెస్టిండీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌కు దూరమయ్యాడు. అంతేకాదు 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆడలేకపోయాడు. నవీన్‌తో పాటు ఫజల్‌హక్ ఫరూఖీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, అజ్మతుల్లా ఒమర్జాయ్‌లు పేస్ విభాగంలో ఉన్నారు.

సీనియర్ ఆల్‌రౌండర్ గుల్బదిన్ నైబ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించిన యువ వికెట్ కీపర్-బ్యాటర్ నూర్ రహ్మాన్‌కు తొలిసారి జాతీయ టీ20 జట్టులో చోటు దక్కింది. దీంతో అఫ్గాన్ జట్టు సీనియర్లు, యువ ఆటగాళ్లతో సమతూకంగా కనిపిస్తోంది. అఫ్గానిస్థాన్ స్పిన్ విభాగం కూడా చాలా బలంగా ఉంది. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నంగ్యాల్ ఖరోటి, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ నబీ వంటి నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. భారత్‌లోని స్పిన్‌కు అనుకూల పరిస్థితుల నేపథ్యంలో వీరి పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది.

భారత్‌తో సిరీస్‌కు ముందు అఫ్గానిస్థాన్ జట్టు ముందుగానే భారత్‌కు చేరుకుని ప్రత్యేక సన్నాహక శిబిరంలో పాల్గొననుంది. అఫ్గానిస్థాన్, భారత్ జట్ల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక టీ20 సిరీస్ కావడం విశేషం. అయితే ఈ ఏడాది జూన్‌లో ఇరు జట్లు ఒక టెస్టు, మూడు వన్డేల్లో తలపడ్డాయి. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈఓ నసీబ్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రతి కీలక టోర్నీ, సిరీస్ కోసం సమతూకమైన, పూర్తిగా సిద్ధమైన జట్టును ఎంపిక చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. భారత్ వంటి దేశానికి తొలిసారి అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని, ఇది అఫ్గాన్ క్రికెట్ సాధించిన పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు.

రిజర్వ్ ఆటగాళ్లుగా ఇజాజ్ అహ్మద్‌జాయ్, షాహిదుల్లా కమాల్, ఫరీద్ అహ్మద్ మాలిక్‌లను అఫ్గానిస్థాన్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. నవీన్ ఉల్ హక్ రీఎంట్రీతో పాటు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ఫజల్‌హక్ ఫరూఖీ వంటి కీలక ఆటగాళ్లతో అఫ్గానిస్థాన్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. సొంత మైదానంలో కాకుండా.. భారత్‌లో జరిగే ఈ సిరీస్‌లో టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని అఫ్గాన్ జట్టు భావిస్తోంది. రహ్మానుల్లా గుర్బాజ్, నూర్ రహ్మాన్ వికెట్ కీపర్లుగా ఉన్నారు. మొత్తంగా చూస్తే.. అఫ్గానిస్థాన్ పటిష్టంగా కనిపిస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు:

ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), నూర్ రెహ్మాన్ (కీపర్), సెడిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతి, ముజీబ్ ఉర్మాద్, ఎఫ్. ఫరూకీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, నవీన్-ఉల్-హక్.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story