Abhishek-Vaibhav: అభిషేక్-వైభవ్ టీమిండియాకు ఓపెనింగ్ చేస్తే.. ఊహించుకుంటేనే భయమేస్తోంది భయ్యా!

Abhishek Sharma and Vaibhav Sooryavanshi T20 Opening Pair: ఐపీఎల్ 2026 సీజన్‌లో భారత యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరించారు.

Rishvik
Published on: 1 Jun 2026 7:08 PM IST
Abhishek-Vaibhav
X

Abhishek-Vaibhav: అభిషేక్-వైభవ్ టీమిండియాకు ఓపెనింగ్ చేస్తే.. ఊహించుకుంటేనే భయమేస్తోంది భయ్యా!

Abhishek-Vaibhav: ఐపీఎల్ 2026 సీజన్‌లో భారత యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరించారు. ఇద్దరూ పవర్‌ప్లే నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ.. పరుగుల వరద పారించారు. ఇద్దరు అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. తమ తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ 2026లో అభిషేక్-వైభవ్ గణాంకాలు చూసిన తర్వాత టీ20 ఫార్మాట్‌లో భవిష్యత్ టీమిండియా ఓపెనింగ్ జోడీగా వీరిని చూడాలనే చర్చలు నెట్టింట జోరుగా సాగుతున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 563 పరుగులు చేశాడు. 40.21 సగటుతో పాటు 204.73 స్ట్రైక్‌రేట్ నమోదు చేసి.. తన దూకుడు బ్యాటింగ్‌ను ప్రపంచ క్రికెట్‌కు మరోసారి చూపించాడు. అతని అత్యధిక స్కోర్ 135 పరుగులు (నాటౌట్). ఈ సీజన్‌లో 4 అర్ధ శతకాలు, ఒక శతకం బాదిన అభిషేక్.. 43 సిక్సర్లు, 50 ఫోర్లు కొట్టి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. రూ.14 కోట్ల పారితోషికాన్ని అందుకున్న అతడు తన విలువకు తగ్గ ప్రదర్శన కనబరిచాడు.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌ను శాసించాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అతని సగటు 48.50 కాగా.. స్ట్రైక్‌రేట్ ఏకంగా 237.31గా ఉండటం విశేషం. అత్యధికంగా 103 పరుగులు చేసిన వైభవ్.. 5 అర్ధ శతకాలు, ఒక శతకం నమోదు బాదాడు. అంతేకాదు 72 సిక్సర్లు, 63 ఫోర్లు బాది బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కేవలం రూ.1.10 కోట్లకు ఐపీఎల్ 2026లో ఆడిన ఈ యువ బ్యాటర్.. టోర్నీలోనే అతిపెద్ద సంచలనంగా నిలిచాడు.

అభిషేక్-వైభవ్ ఆటతీరు పరిశీలిస్తే.. టీ20 క్రికెట్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేయడం, స్పిన్నర్లు-పేసర్లపై దాడి చేయడం, మ్యాచ్‌ను కొన్ని ఓవర్లలోనే మలుపుతిప్పే సామర్థ్యం వీరిద్దరిలో ఉంది. ఎడమచేతి బ్యాటర్లైన ఈ జోడీ బౌలర్లకు కొత్త సవాళ్లు విసరగలదు. అయితే జాతీయ జట్టులో స్థిరమైన స్థానం పొందాలంటే.. ఐపీఎల్ ప్రదర్శనతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ అదే స్థిరత్వాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అభిషేక్ ఇప్పటికే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. వైభవ్ త్వరలోనే టీమిండియాకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఐపీఎల్ 2026లో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ చూపించిన విధ్వంసకర బ్యాటింగ్‌ను చూసిన టీమిండియా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 'భవిష్యత్ టీ20ల్లో టీమిండియాలో అభిషేక్ -వైభవ్ ఓపెనింగ్ జోడీని కచ్చితంగా చూస్తాం' ధీమా వ్యక్తం చేస్తున్నారు. 'అభిషేక్-వైభవ్ జోడీని ఊహించుకుంటేనే భయమేస్తోంది భయ్యా', 'టీ20 క్రికెట్‌కు కావాల్సింది ఇలాంటి ఓపెనింగ్ జోడి' అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ -వైభవ్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే.. అభిమానుల ఆశలు త్వరలోనే నెరవేరేలా కనబడుతున్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story