Yashoda Krishna Story: అమ్మంటే యశోదే... గారాభం చేస్తూనే... కన్నయ్యను దారిలో పెట్టిన మాతృమూర్తి
సృష్టికర్తకే మాతృత్వపు మాధుర్యాన్ని రుచి చూపించిన మహా మాతృమూర్తి యశోద.
Yashoda Krishna Story: సృష్టికర్తకే మాతృత్వపు మాధుర్యాన్ని రుచి చూపించిన మహా మాతృమూర్తి యశోద. కన్నది దేవకీదేవి అయినా, నందనందనుడి అల్లరిని భరించి, ఆ వెన్నదొంగ చిలిపి చేష్టలకు మురిసిపోయి, లోకానికి మాతృప్రేమ అంటే ఏమిటో చాటిన ఆదర్శమూర్తి ఆమె. మే 10, మాతృదినోత్సవం సందర్భంగా, కన్నయ్యను పెంచి పెద్ద చేసిన యశోదమ్మ వైభవాన్ని, యశోదలోని గొప్పదనాన్ని భక్తి కోణంలో నెమరువేసుకుందాం.
వరమే ఈ మాతృత్వం - 14 భువనాల సాక్షిగా
పురాణాల ప్రకారం, యశోదమ్మ పూర్వజన్మలో 'ధార' అనే వసువు. శ్రీమన్నారాయణుడిని తన బిడ్డగా పొందాలని ఆమె చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన స్వామి, ద్వాపరయుగంలో ఆమె గర్భాన కాకపోయినా, ఆమె ఒడిలో పెరిగే వరాన్ని ఇచ్చారు. వసుదేవుడు అర్ధరాత్రి వేళ యమునా నది దాటి, చిన్ని కృష్ణుని యశోద చెంత చేర్చడం వెనుక ఉన్న మర్మం ఇదే. యశోదకు దక్కిన వరం లోకంలో మరెవ్వరికీ దక్కలేదు. ప్రతి యుగంలో శ్రీమహావిష్ణువు వివిధ రూపాల్లో అవతరించినా...ద్వాపరయుగంలో యశోదమ్మ ఒడిలో పెరిగిన తీరు అద్భుతం.
శిక్షలోనూ ప్రేమే - ఆ రోలుకు కట్టిన బంధం!
యశోదమ్మ కేవలం గారాభం చేసే తల్లి మాత్రమే కాదు, కన్నయ్యను సరైన దారిలో పెట్టే గురువు కూడా. కన్నయ్య మట్టి తిన్నాడని తెలిసినపుడు కోపంతో నోరు తెరవమన్నప్పుడు యశోదకు ఆ 14 భువనాలు అందులో కనిపించాయి. అది చూసి సంబ్రమాశ్చర్యాలతో భయపడిపోయింది. ఈ మరుక్షణమే అంతా మర్చిపోయి బిడ్డను హత్తుకున్న అజ్ఞానపుటమ్మ యశోద. గోపికల ఇళ్లలో వెన్న దొంగిలిస్తున్నాడని తెలిసి క్రమశిక్షణ నేర్పడానికి కన్నయ్యను రోలుకు కట్టివేస్తుంది. ముల్లోకాలను బంధించగలిగినవాడైన ఆ పరమాత్ముడు యశోదమ్మ ప్రేమకు లొంగిపోయాడు. అందుకే ఆ స్వామిని దామోదరుడు అని పిలుస్తారు.
నేటి తల్లులకు యశోదమ్మ ఇచ్చే సందేశం
శ్రీకృష్ణుడు వేణువు పలికించినా... గోవులను కాసినా... అమె ఎప్పుడు అడ్డుచెప్పలేదు. బిడ్డలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించింది. బిడ్డలకు స్వేచ్చను ఇవ్వాలి. అంతేకాదు, అతిగారాభం చేయడం వలన బిడ్డ చెడిపోతాడు అని తెలిసి అవసరమైన సందర్బాల్లో దండించింది కూడా. శ్రీకృష్ణుడు తన బిడ్డ కాదని తెలిసినా...ఆమె చూపిన వాత్సల్యం నేటికీ లోకానికి పాఠం. యశోదమ్మ ప్రేమ ఎంతటిదంటే, ద్వాపరయుగంలో కృష్ణుడి కళ్యాణం చూడలేకపోయానని ఆమె బాధపడితే, కలియుగంలో వకుళమాతగా జన్మించి వేంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని జరిపించింది. తల్లి ప్రేమకు భగవంతుడు ఇచ్చే గౌరవం ఇది. ఈ మాతృదినోత్సవం వేళ, ప్రతి తల్లిలోనూ యశోదమ్మను దర్శిద్దాం. తల్లులందరికి వందనం చేద్దాం.




