Jambukeswarar Temple Mystery: వివాహాలు జరగని ఏకైక ఆలయం... ఇక్కడ పూజారులే స్త్రీలుగా మారిపోతారు...ఎందుకంటే

పంచభూత లింగాలలో ఒకటైన జంబూకేశ్వరం ఆలయంలో వివాహాలు ఎందుకు జరగవు? అక్కడ పూజారులు స్త్రీ వేషధారణలో ఎందుకు పూజలు చేస్తారు? ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

Balachander
Published on: 21 May 2026 9:34 AM IST
Jambukeswarar Temple Mystery: వివాహాలు జరగని ఏకైక ఆలయం... ఇక్కడ పూజారులే స్త్రీలుగా మారిపోతారు...ఎందుకంటే
X

Jambukeswarar Temple Mystery: సృష్టిలో శివకేశవుల లీలలు అత్యంత విలక్షణమైనవి. భక్తుల కోసం స్తంభాన్ని చీల్చుకుని, శివలింగాన్ని బద్దలు కొట్టుకుని వచ్చిన ఆ దేవుళ్ల మహిమలు అపారం. అలాంటి ఒక పరమ పవిత్రమైన, వింత ఆచారాలు కలిగిన క్షేత్రమే తమిళనాడులోని తిరువానైకావల్ జంబూకేశ్వర ఆలయం. పంచభూత లింగాలలో 'జలతత్వానికి' నిదర్శనమైన ఈ పురాతన ఆలయంలో కొన్ని శతాబ్దాలుగా ఒక వింత సాంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడి గర్భగుడిలో ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. అంతేకాదు, ఈ పవిత్ర ప్రాంగణంలో భక్తుల వివాహాలు అస్సలు జరగవు. అలాగే, ఇక్కడి పురుష పూజారులు రోజూ మధ్యాహ్నం వేళ స్త్రీ వస్త్రాలు ధరించి స్వామివారిని అర్చించడం వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. సుమారు 1800 సంవత్సరాల క్రితం చోళ వంశానికి చెందిన కోకెంగనన్ రాజు ఈ అద్భుత శిల్పకళా నిలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో దాగున్న రహస్యాలేంటో తెలుసుకుందాం.

అమ్మవారి తపస్సు - ఎదురెదురుగా ఉండే విగ్రహాలు

పురాణాల ప్రకారం, ఒకసారి పార్వతీదేవి చేసిన చిన్న పొరపాటు వల్ల శివుని ఆజ్ఞ మేరకు భూలోకంలోని జంబూ వనానికి వచ్చి, కావేరీ నది నీటితో శివలింగాన్ని ప్రతిష్టించి ఘోర తపస్సు చేసింది. అమ్మవారి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు జ్ఞానాన్ని ఉపదేశించి, ఎల్లప్పుడూ తనకు ఎదురుగా ఉండేలా అనుగ్రహించాడు. ఈ కారణంగానే జంబుకేశ్వరం ఆలయంలో స్వామివారు, అమ్మవార్ల విగ్రహాలు ఎదురెదురుగా ఉంటాయి. దీనిని గురు శిష్యుల స్థానంగా చెబుతారు. అమ్మవారు శిష్యురాలిగా మారి జ్ఞానాన్ని పొందింది కాబట్టి ఈ ప్రాంగణాన్ని గురుపీఠంగా భావిస్తారు. అందుకు ఇక్కడ మానవుల వివాహాలు జరగవు. కానీ, ప్రతి ఏడాది స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

పూజారులు స్త్రీలుగా మారే రహస్యం ఇదే!

ఈ ఆలయంలోని అత్యంత ఆసక్తికరమైన అంశం మధ్యాహ్న పూజ. అమ్మవారు స్వయంగా శివుడిని పూజించిన విధానాన్ని గుర్తుచేస్తూ, ఇక్కడి ప్రధాన అర్చకుడు చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, ఆ అమ్మవారి రూపంలో వెళ్లి జంబూకేశ్వరుడికి మంగళహారతి ఇస్తారు. అమ్మవారి తపశ్శక్తిని లోకానికి చాటడమే ఈ ఆచారం వెనుక ఉన్న పరమార్థం.

ఇక ఈ ఆలయంలో మొత్తం ఐదు ప్రాకారాలున్నాయి. ఈ ఐదు నీటి మూలకాలను సూచించేవిగా ఉంటాయి. నాలుగో ప్రాకారం గోడ 32 అడుగుల ఎత్తుతో, వేలాది అడుగుల చుట్టుకొలతతో ఉంటుంది. మహాశివుడు స్వయంగా ఓ వృద్ధ శిల్పిరూపంలో వచ్చి ఈ ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు. ఆలయం బయట ఎంత ఎండ ఉన్నప్పటికీ ఆలయం లోపల ఎల్లప్పుడూ చల్లగా, తడిగా ఉంటుంది. జంబుకేశ్వరుడిని దర్శించుకునే ముందు తప్పనిసరిగా ఇక్కడి కావేరీ నదిలో స్నానం చేయాలనే నియమం వందల సంవత్సరాలుగా వస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ నదిలో స్నానం చేసిన తరువాతే స్వామివారిని దర్శించుకుంటారు. పంచభూతాల్లో ఒకటైన జలతత్వానికి ప్రతీకగా ఉన్న ఈ జంబుకేశ్వరాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించుకోవాలి. జంబుకేశ్వరుడిని దర్శించుకుంటే జలగండాల నుంచి బయటపడతారని, వివాహ దోషాలు తొలగిపోతాయని, గురువు అనుగ్రహం కలుగుతుందని చెబుతారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story