Hanuman: శ్రీకృష్ణుడిని తలపించే భజరంగబలి బాల్యం... ఆయన బలాన్ని అందుకే మర్చిపోయాడు
భజరంగబలి బాల్యంలో జరిగిన అద్భుత సంఘటనలు, ఋషుల శాపం వల్ల హనుమంతుడు తన బలాన్ని ఎందుకు మర్చిపోయాడో తెలుసుకునే ఆధ్యాత్మిక కథనం ఇది.
Hanuman: పురాణాల్లో బాల్యం గురించి చెప్పుకోవాలంటే శ్రీకృష్ణుడినే తీసుకుంటాం. వ్రేపల్లెలో గోవుల మధ్య, గోపికల మధ్య, ఆ యశోదమ్మ ముద్దుల తనయుడు చేసిన అల్లరిని చెప్పుకొని, తలచుకొని పరవశించిపోతాం. శ్రీకృష్ణుడిది ద్వాపరయుగం. కానీ, త్రేతాయుగంలోనే శ్రీకృష్ణుడి అంతటి అల్లరితో అందరిని ఆశ్చర్యపోయేలా చేసినవాడు ఆంజనేయుడు. మనకు ఏ కష్టమోచ్చినా, భయం వేసినా వెంటనే జై హనుమాన్ అని పలుకుతాం. రుద్రాంశ సంభూతుడిగా, వాయుపుత్రుడిగా జన్మించిన హనుమంతుడు బాల్యంలో చేసిన ఓ చిన్న పొరపాటు ఋషుల శాపం వలన ఆయన తన బలాన్ని తానే మర్చిపోయేలా చేసింది. ఈ కథ వెనుక మన సమాజానికి ఉపయోగపడే పరమార్ధం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మునుల ఆశ్రమాలు... బాల హనుమ అల్లరి!
బాల్యంలో హనుమంతుడికి అమితమైన బలంతో పాటు అంతేస్థాయిలో చాపల్యం కూడా ఉండేది. వనాలలో తిరుగుతూ, తపస్సు చేసుకునే మునుల కమండలాలను దాచడం, వారి యజ్ఞ వాటికలను అస్తవ్యస్తం చేయడం, చెట్లను పెకిలించడం వంటివి చేసేవాడు. హనుమ ఎవరో మునులకు తెలుసు. ఆయన చేసిన అల్లరి వెనుక లోకకళ్యాణం దాగుందని వారికి తెలుసు. అందుకే బాల హనుమయ్యను ఏమీ అనలేకపోయారు. అంతేకాదు, హనుమంతుడు సాక్షాత్తు ఆ రుద్రుని 11వ అవతారంగా చెబుతారు. అందువలన ఆయన వేగాన్ని, బలాన్ని ఆపడం ఎవరికీ సాధ్యపడలేదు. సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటారు. కానీ, అంజనాదేవి, కేసరి ఎంత వారించినా వానర కిశోరాన్ని ఆపడం సాధ్యం కాలేదు.
ఋషుల శాపం... బలాన్ని మర్చిపోవడానికి గల కారణం
హనుమంతుడి అల్లరి భరించలేక, ఒకరోజు మునులందరూ కలిసి ఒక లోకోపకారమైన నిర్ణయం తీసుకున్నారు. హనుమకు తన శక్తిపై అహంకారం రాకూడదని, అలాగే లోకానికి హాని కలగకూడదని శాపం ఇచ్చారు. "ఓ వాయుపుత్రా! నీ అపారమైన బలమే నీ అల్లరికి కారణమైంది. కాబట్టి, ఏ శక్తులనైతే చూసుకుని నువ్వు ఈ పనులు చేస్తున్నావో... ఆ స్వశక్తిని నువ్వు పూర్తిగా మర్చిపోతావు. భవిష్యత్తులో ఎవరో ఒకరు నీకు నీ బలాన్ని గుర్తుచేసే వరకు నీకు నీ శక్తి తెలియదు." అని శపిస్తారు. అప్పటినుండి హనుమంతుడు ఒక సామాన్య వానరుడిలా మారిపోయాడు. ఆ తర్వాత కాలంలో, సీతాన్వేషణ సమయంలో సముద్రాన్ని లంఘించాల్సి వచ్చినప్పుడు, జాంబవంతుడు హనుమకు ఆయన 100 యోజనాల సముద్రాన్ని దాటగల అపార శక్తిని గుర్తుచేస్తాడు. అప్పుడు మాత్రమే హనుమ మహాబలవంతుడిగా మారి విశ్వరూపం దాల్చాడు.
హనుమ బాల్యం నుండి మనం నేర్చుకోవలసిన జీవన సూత్రం
ఈ అద్భుత ఘట్టం నుండి నేటి తరం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మనకు ఎంత బలం, అధికారం, సంపద ఉన్నప్పటికీ... వాటిని అకారణంగా ఇతరులపై ప్రదర్శించకూడదు. అవసరమైనప్పుడు, ధర్మ రక్షణ కోసం మాత్రమే మన శక్తిని ఉపయోగించాలి. కృష్ణుడిలా అల్లరి చేసినా, ఆ తర్వాత క్రమశిక్షణతో కూడిన భక్తికి హనుమంతుడు నిదర్శనంగా నిలిచాడు. అందుకే ఆయనకు తన బలం గుర్తుకొచ్చిన తర్వాత, ఆ బలాన్ని కేవలం శ్రీరామచంద్రుని సేవకే అంకితం చేశారు. భజరంగబలి చరితం చదవడం వల్ల మనలో ఉన్న దాగి ఉన్న బలం కూడా మేల్కొంటుంది. కాబట్టి హనుమంతుడిని మనం కేవలం బలవంతుడిగా ఆరాధించడం మాత్రమే కాకుండా ఆయన బాల్యంలో జరిగిన సంఘటనలు తెలుసుకొని ఆయనలా భక్తిమార్గంలో నడిస్తే మనం కూడా తప్పకుండా ప్రతి పనిలోనూ విజయం సాధించగలుగుతాం.




